పేరు (ఆంగ్లం) | Pennepalli Gopalakrishna |
పేరు (తెలుగు) | పెన్నేపల్లి గోపాలకృష్ణ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/01/1937 |
మరణం | 05/27/2011 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | భారతీయుల అశేష పోరాటాల,త్యాగాల చరిత్రను “ఇంద్రధనుస్సులో ఏడోరంగు” పరిశోధన గ్రంథంలో గోపాలకృష్ణ గొప్పగా వివరించాడు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పెన్నేపల్లి గోపాలకృష్ణ |
సంగ్రహ నమూనా రచన | – |
పెన్నేపల్లి గోపాలకృష్ణ
పెన్నేపల్లి గోపాలకృష్ణ ప్రముఖ తెలుగు సాహిత్యకారుడు, సంపాదకుడు, పాత్రికేయుడు. నెల్లూరు జిల్లా, నాయుడుపేట సమీపంలోని పెన్నేపల్లిలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన నెల్లూరు వి. ఆర్. కళాశాల, మద్రాసు న్యాయకలాశాలలో చదివాడు. చదువుకునే రోజుల నుంచి సాహిత్యం మీద ఇష్టం పెంచుకున్నాడు. న్యాయవాదిగా పనిచేస్తూనే పత్రికా సంపాదకుడుగా, ప్రచురణ కర్తగా కూడా వ్యవహరించాడు. నెల్లూరు ప్రముఖ వారపత్రిక జమీన్ రైతులో సంపాదకవర్గంలో సభ్యుడిగా పనిచేసి “జమీన్ రైతు గోపి” అని ప్రసిద్ధి పొందాడు. ఉదయం, వార్త దినపత్రికల్లో కూడా చాలాకాలం పనిచేశాడు. 2011 మే 27న మరణించాడు.
గోపాలకృష్ణ నెల్లూరుజిల్లా, నాయుడుపేటకు సమీపంలోని పెన్నేపల్లిలో ఒక వ్యవసాయ కుటుంబంలో 1937లో జన్మించాడు. తల్లి రుక్మిణమ్మగారు, తండ్రి తండ్రి చెంచువెంకట సుబ్రహ్మణ్యం నాయుడుగారు.నెల్లూరు వి.ఆర్ కళాశాలలో విద్యాభాసం కొనసాగిస్తున్న రోజుల్లోనే నటన మీద, సాహిత్యం మీద అభిరుచి కలిగింది. అప్పటి కళాశాల మేనేజర్ శ్రీ టి. వి. రమణారెడ్డిగారి శిక్షణలో నాటకప్రదర్శనల్లో, సాహిత్యంలో అభిరుచి పెంచుకున్నాడు. మద్రాసులో బి.యల్ విద్యార్థిగా ఉన్నకాలంలో కవులు, కళాకారులు, పాత్రికేయులతో పరిచయాలవల్ల గోపాలకృష్ణలో సాహిత్యంపట్ల ఉత్తమాభిరుచి పెంపొందింది.
నెల్లూరులో న్యాయవాదిగా పనిచేస్తూ యల్.వి.కృష్ణారెడ్డి నెలకొల్పిన యూత్ కాంగ్రెస్ స్థానిక వారపత్రికలో సంపాదకుడుగా (1960-69) పనిచేశాడు. 1962లో మిత్రులతో కలిసి “యువభారతి” సాంస్కృతిక సంస్థ నెలకొల్పి, నెల్లూరు ప్రజలకు ప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారుల కళను పరిచయం చేసాడు.
1971 చివరలో నెల్లూరు వారపత్రిక జమీన్ రైతు సంపాదకవర్గ సభ్యుడుగా చేరాడు. “మాటకచేరి” శీర్షికలో ‘గోపి’ కలం పేరుతో వారం వారం ఒక ‘కాలం’ నిర్వహించడం వల్ల “గోపి, జమీన్ రైతు గోపి” అని నెల్లూరు లో వాడుక. మాటకచేరి కాలంలో జిల్లా స్థానికచరిత్ర, సాహిత్యం, సినిమాలు, సంస్కృతి మీద అనేక వ్యాసాలు రాసాడు. కావలి జవహర్ భారతి కళాశాల ప్రధానాచార్యులు యం. పట్టాభిరామిరెడ్డి స్థాపించిన ఆంద్రప్రదేశ్ చరిత్ర సభల స్థాపక సభ్యుడిగా ఆ సంస్థ జయప్రదం కావడానికి జమీన్ రైతు లో వ్యాసాలు రాసి సహకరించాడు. A.P.History Congress సభలకు కొన్నేళ్ళు వరసగా హాజరయి, పరిశోధన పత్రాలు సమర్పించాడు. .నెల్లూరులో మిత్రులతో కలిసి ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అసోసియేషన్(ప్రొఫిల్మ్) అనే పేరుతొ ఫిల్మ్ సొసైటీ నెలకొల్పి, ఆ సొసైటీ ప్రదర్శించిన గొప్ప గొప్ప, జాతీయ అంతర్ జాతీయ కళా ఖండాలమీద సమీక్షలు రాసి నెల్లూరు ప్రజల సినిమా కళాభిరుచికి దోహదం చేశాడు. నెల్లూరు కెమెరా క్లబ్, త్యాగరాజ సంస్మరణోత్సవాలు వంటి సాంస్కృతిక విషయాలమీద గొప్ప వ్యాసాలు రాశాడు. అనేక నాటక పరిషత్తుల్లో న్యాయ నిర్ణేతగా చాలా సంవత్సరాలు పాల్గొన్నాడు.
1969లో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం కార్యదర్శిగా, ఆ సంస్థ తరఫున డెక్కన్ పోయెట్స్, ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత, కవిత్రయ కవితా వైజయంతి గ్రంథాలు ప్రచురించాడు.పుస్తకాలు అందంగా, నిర్దుష్టంగా ప్రచురించడంలో తను విశేష ప్రగ్జ కలిగినవాడు. ఒకనాటి పార్లమెంట్ సబ్యులు ఆర్.యల్.రెడ్డి షష్టిపూర్తి సావనీర్ కు సంపాదకబాధ్యత వహించి,అచ్చు వేశాడు. నెల్లూరు నగరంలో అభ్యుదయ వేదిక, హేతువాదసమాజం తదితర సమాజ హిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, పత్రికా రచయితగా ఆ ఉద్యమాలను ప్రోత్సహించాడు. జమీన్ రైతు లో శివారెడ్డి పద్యాలన్నీ సేకరిచి “శివారెడ్డి పద్యాలు” పేరుతో ఒక పుస్తకం తీసుకొని వచ్చాడు. తన మేనమామ గూడూరు రాజేంద్రరావు రాసిన కథలను, భారతి తదితర తెలుగు పత్రికలలో అచ్చయిన కథలను సేకరించి “గూదూరు రాజెంద్రరావు కథలు”పేరుతొ ఒక కథాసంకలనాన్ని ప్రచురించి, దానికి మంచి పరిచయాన్ని రాశాడు.
నెల్లూరు లో మదర్ థెరీసా నెలకొల్పిన “నిర్మల హృదయ భవన్” స్థాపనలో ఉత్సాహంగా పాల్గొని తనవంతు కృషి, సహకారం అందించాడు.
1973-82 సంవత్సరాల్లో ఆకాశవాణి, దూరదర్శన్ నెల్లూరు జిల్లా విలేకరిగా ఉన్నాడు. వర్ధమానసమాజ కార్యదర్శిగా ఉన్నకాలంలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్య్డుడుగా ఎన్నికయి మూడేళ్ళు అకాడమి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
ప్రత్యేక ఆంద్ర ఉద్యమం
1973 ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో సమైక్యవాదిగా జమీన్ రైతు పత్రికతోపాటు అనేక ఇబ్బందులను, కష్టాలను చవిచూచినా, తన అభిప్రాయాల ప్రకారం నిర్భయంగా నిలబడ్డాడు. కె. వి. రమణారెడ్డి “జయిలు డైరీ” ముద్రాపకుడుగా క్రిమినల్ కోర్ట్ కేసులను, పోలీసు వేధింపులను భరించవల్సి వచ్చింది. నెల్లూరులో వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్, డాక్టర్ రవూఫ్ వంటి యువకవులను ప్రోత్సహించి వారి కవితలను జమమీన్ రైతు లోప్రచురించి ప్రోత్సహించాడు. నెల్లూరు లో ఉన్నకాలంలో జల్లాలో యక్కడ నాటక పరిషత్ జరిగినా గోపాలకృష్ణ న్యాయనిర్ణేతగా ఉండేవాడు.
1983 లో హైదరాబాదువెళ్లి ఉదయం దినపత్రిక లో సీనియర్ పాత్రికేయుడుగా జీవితం ప్రారంభించాడు. రాజకీయ విషయాలమీద కన్నా సాహిత్యం, సినిమా వంటి వాటిమీదనే తన దృష్టి ఉండేది. ఉదయంలో ఉన్నప్పుడు, తర్వాత వార్త దినపత్రికలో ఉన్నప్పుడు ఆయన రాసిన వ్యాసాలూ, నిర్వహించిన శీర్షికలు ఆయన అభిరుచులను తెలియజేస్తాయి. ఈరొజుల్లొనే కొంతకాలం హైదరాబాద్ దూరదర్శన్ కు తెలుగులో వార్తలు రాసిపెట్టాడు.
తిరుపతిలో ‘ఉదయం’ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నసమయంలో మిత్రులు త్రిపురనేని, భూమన్, సాకం నాగరాజ,భాస్కర చౌదరి వంటి వారితో కలిసి “కన్యాశుల్కం” శతజయంతి చాలా ఘనంగా ఏడాది పాటు నిర్వహించాడు. ప్రతి ఆదివారం ఒక విద్యాసంస్థకు వెళ్లి ఈ బృందం సబ్యులు గురజాడ రచనలను విద్యార్థులకు చదివి వినిపించారు.1993 ఆగస్ట్ లో యస్.వి. యూనివర్సిటీలో మహాకవి గురజాడ అప్పారావు గారి మిద గొప్ప సెమినార్ నిర్వహించాడు. విజయనగరంలో వెలుగు సంస్థ తరఫున శాసపు రామినాయుడు నిర్వహించిన కన్యాశుల్కం నూరేళ్ళపండుగ ఉత్సవాలలో కే.వి.ఆర్, చలసాని వంటి ప్రముఖులతో కలిసి పాల్గొన్నాడు.
గురజాడమీద పరిశోధన
1989 నుండి గోపాలకృష్ణ తన మిత్రుడు కాళిదాసు పురుషోత్తంతో కలిసి ఆంద్రప్రదేశ్ స్టేట్ Archives, హైదరాబాద్ లో భద్రపరచిన గురజాడ రాత ప్రతులను, రికార్డ్ ను పరిశీలించడం అలవాటుగా మార్చుకున్నాడు. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ గురజాడ రచనలను అవసరాల సూర్యారావు గారిచేత తెలుగులోకి అనువదింప చేసి ప్రచురించింది గాని, గురజాడ ఇంగ్లీష్ రచనలను ఇంగ్లీష్ లో ప్రచురించలేదు. ఏ రచయిత రచనలయినా ముందు ఆయన ఏభాషలో రాస్తాడో, ఆభాషలోనే ఆ రచనలు అచ్చుకావాలని, గురజాడ విషయంలో అందుకు భిన్నంగా జరిగిందని, గురజాడ ఇంగ్లీషు రచనలు యధాతధంగా ఎప్పటికయినా ప్రచురణ కావాలని ఆయన ఆకాంక్షిచాడు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సహకారంతో స్టేట్ Archives లోని గురజాడ రికార్డును స్కాన్ చేయించి డిజిటల్ కాపీ సంపాదించి గురజాడ దినచర్యలను పరిశీలించి, కాపీచేసి, ఒక ప్రతిని అచ్చుకు సిద్ధం చేసాడు. A.P.Oriental, Manuscripts Library, and Research Institute, Hyderabad సంస్థ 2009 లో , “Diaries of Gurajada” పుస్తకాన్ని గోపాలకృష్ణ notes తో, పాదసూచికలతో అచ్చువేసింది. గోపాలకృష్ణ గురజాడ ఇంగ్లీష్ ఉత్తర ప్రత్యుత్తరాల రాతప్రతులను పరిశీలించి,ఎత్తిరాసి ముద్రణకు సిద్ధం చేయడానికి పూనుకున్న సమయంలో “మనసు ఫౌండేషన్” యం. వి. రాయుడుగారు గురజాడ సమగ్ర రచనల సంపుటాన్ని ప్రచురించడానికి ముందుకు వచ్చారు. గోపాలకృష్ణ శ్రమించి సిద్దం చేసిన ‘గురుజాడలు’ ‘గురజాడ లబ్ధ సమగ్ర రచనల సంపుటం” గురజాడ 150వ జయంతి రోజు, విజయనగరంలో విడుదల చేసారు కాని ఆ సంపుటాన్ని చూడడానికి ఆయన లేడు. అనారోగ్యంతో ఆయన 2011 మే 27న 73వ ఏట చనిపోయాడు.. ‘గురుజాడలు’ 2000 పుటల గ్రంథాన్ని శ్రీమతి ఉమాగోపాలకృష్ణ గారి చేత మనసు ఫౌండేషన్ విడుదల చేయించింది.
ఇతర రచనల, పరిశోధనలు
ఐక్యరాజ్య సమితిలో వర్ణవివక్ష నిర్మూలన శాఖలో సహాయ కార్యదర్శి పదవిలో ఉన్న ఏనుగు శ్రీనివాసులురెడ్డి గారి ప్రోత్సాహంతో, మహాత్ముని నాయకత్వంలో వర్నవివక్షకు వ్యతిరేకంగా దక్షిణ ఆఫ్రికాలో జరిగిన పోరాటంలో, ఉద్యమంలో భారతీయులు నిర్వహించిన పాత్రను, అందులో పాల్గొన్న భారతీయుల అశేష పోరాటాల,త్యాగాల చరిత్రను “ఇంద్రధనుస్సులో ఏడోరంగు” పరిశోధన గ్రంథంలో గోపాలకృష్ణ గొప్పగా వివరించాడు. అమెరికాలో అనేక గ్రంథాలయాల్లో ఈ పుస్తకానికి అవసరమయిన విషయ సేకరణ చేసాడు. ప్రజాశక్తి ప్రచురణ సంస్థ 2003లో దీన్ని ప్రచురించగా, నెల్లూరులో డాక్టర్ పుచ్చలపల్లి రామచెంద్రారెడ్డి వైద్యశాలలో(PPC) ఏర్పాటయిన సభలో ఆ వైద్యశాల ప్రధాన వైద్యులు డాక్టర్ జెట్టి శేషారెడ్డి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించాడు…2007 జనవరి మాసం చివర శాన్తినికేతనం విశ్వవిద్యాలయం లో జరిగిన Indian History Congressకు గోపాలకృష్ణ హాజరయ్యాడు.
గోపాలకృష్ణ పాత్రికేయ జీవితంలో ఆయన పని చేసిన చివరి పత్రిక ‘ఈ భూమి’ని ఆయన మిత్రులు కే.సి.రెడ్డి స్థాపించాడు. ఈ పత్రిక సంపాదక వర్గంలో సభ్యుడుగా ఉండి, ఒక ‘కాలం’ నిర్వహించడమేగాక, అనేక సాహిత్య సామాజిక సంబంధమైన వ్యాసాలు రాశాడు. ఈయన గురజాడ సృష్టి “మధురవాణి ఉహాత్మక ఆత్మకథ”ను ఒక కాల్పనిక రచనగా చేశాడు. విమర్శకులు తెలుగు సాహిత్యంలో దీన్ని ఒక నూతన ప్రక్రియగా భావించారు. ఈ పుస్తకాన్ని “ఈ భూమి” పత్రికాధిపతి కే.సి.రెడ్డిగారే అచ్చువేశారు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియగా ప్రసిద్ధి పొందింది. ప్రజాశక్తి ప్రచురణ సంస్థ దీనికి ద్వితీయ ముద్రణ తెచ్చింది.
గోపాలకృష్ణ జూలియా థామస్ గ్రంథం “Letters from a lady”ని తెలుగులోకి అనువదించి, అచ్చుకు సిద్ధం చేశాడుకాని, పుస్తకం ముద్రణ కాకముందే ఆయన పోయాడు. రాతప్రతి లభించలేదు. మొదటి draft తాలూకు కొంత భాగం మాత్రం లభించింది.
———–