ధర్మవరం రామకృష్ణమాచార్యులు (Dharamavaram Ramakrishnamacharyulu))

Share
పేరు (ఆంగ్లం)Dharamavaram Ramakrishnamacharyulu
పేరు (తెలుగు)ధర్మవరం రామకృష్ణమాచార్యులు
కలం పేరు
తల్లిపేరులక్ష్మీదేవమ్మ
తండ్రి పేరుకృష్ణమాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1853
మరణం11/30/1912
పుట్టిన ఊరుధర్మపురి అగ్రహారము
విద్యార్హతలుతాతగారి వద్ద రఘువంశము, చంపూరామాయణము, ప్రతాపరుద్రీయము చదివాడు. 1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను, సెకండరీగ్రేడ్ ప్లీడర్‌షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుషిప్ పరీక్షకు బురికొల్పి యందుత్తీర్ణుని గావించెను.
వృత్తివకీలు
తెలిసిన ఇతర భాషలుసంస్కృత, కన్నడ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగాధినందను చరిత్రము (పద్యకావ్యము) (అసంపూర్ణము), ఉన్మాదరాహు ప్రేక్షణికము, మదనవిలాసము, చిత్రనళీయము, పాదుకా పట్టాభిషేకము, భక్త ప్రహ్లాద, సావిత్రీ చిత్రాశ్వము, మీళార్జునీయము, పాంచాలీస్వయంవరము, చిరకారి, రోషనారా శివాజీ, వరూధినీ నాటకము,
అభిజ్ఞానమణిమంతము, ఉషాపరిణయము, సుశీలాజయపాలీయము, అజామిళ, యుధిష్ఠిర యౌవరాజ్యము, సీతాస్వయంవరము, ఘోషయాత్ర, రాజ్యాభిషేకము, సుగ్రీవపట్టాభిషేకము, విభీషణపట్టాభిషేకము, హరిశ్చంద్ర, గిరిజాకళ్యాణము, ఉదాస కళ్యాణము, ఉపేంద్ర విజయ (కన్నడ),
స్వప్నానిరుద్ధ (కన్నడ), హరిశ్చంద్ర (ఇంగ్లీష్)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్రనాటక కవితా పితామహుడు
ఇతర వివరాలుఇతనికి సంగీతంలో, ఆయుర్వేదంలో, నాడీశాస్త్రంలో,జ్యోతిశ్శాస్త్రంలో,చదరంగంలో ప్రావీణ్యం ఉంది. కవితాశక్తిని అలవరచుకుని అష్టావధానాలు, శతావధానాలు చేశాడు. ఈయాచార్యకవి యద్భుత మేధాశక్తి యెన్నో కళలను గ్రహించినది. ఆయుర్వేదము వీరు లెస్సగ నెఱుంగుదురు. అది వీరి వంశపారంపర్యముగ వచ్చు విద్య. నాడీపరీక్షలో నీయన సిద్ధహస్తులట. జ్యోతిశ్శాస్త్రమునను వీరి ప్రవేశము చాల గొప్పది. 1886లో బళ్లారిలో సరసవినోదిని అనే నాటకసభను నెలకొల్పాడు. చదరంగ మాడుట యన్న వీరికి చెప్పరాని మక్కువ. వీరి నాటక చక్రములో ‘చిత్రనళీయము ‘ మిన్నందిన ప్రఖ్యాతి గొన్నది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికధర్మవరం రామకృష్ణమాచార్యులు
సంగ్రహ నమూనా రచనశ్రీమత్కృష్ణమాచార్యకవికి బూర్వము తెలుగులో స్వతంత్రనంవిధానము గలనాటకములు లేవు. ఉన్న నాటకములు సంస్కృతమున కనువాదములు. ఆ కారణమున నాంధ్రరంగస్థలములు విస్తరించి వెలయలేదు.

ధర్మవరం రామకృష్ణమాచార్యులు

శ్రీమత్కృష్ణమాచార్యకవికి బూర్వము తెలుగులో స్వతంత్రనంవిధానము గలనాటకములు లేవు. ఉన్న నాటకములు సంస్కృతమున కనువాదములు. ఆ కారణమున నాంధ్రరంగస్థలములు విస్తరించి వెలయలేదు. పాశ్చాత్య సంప్రదాయము, ప్రాచీన సంప్రదాయము నెఱిగి యొకరకమగు క్రొత్తత్రోవదీసి నాటకములు రచించి స్వతంత్ర నాటకరచయితలకు మార్గదర్శి యనిపించుకొనిన మహాశయు డీయన. వీరి కృషిని గుర్తించి గద్వాల మహారాజవరుడు 1910 లో నీయాచార్యకవిని, రత్నస్థగితమగు పతకముతో ‘ఆంధ్రనాటక కవితా పితామహు ‘డని బిరుదమొసగి గౌరవించెను. విచిత్రసమ్మేళనము గావించి నాటకపాత్రములకు గేవ లాంధ్ర త్వము నాపాదించి తొలుదొల్త స్వతంత్రనాటకములు రచించినావాడగుటచే నీ కవివరున కీబిరుద మన్వర్థ మని నాడు పెక్కుపండితు లగ్గించిరి. పురప్రముఖులు ముగ్దులై యొక కిరీటమర్పించిరి. ఆచార్యుల వారు నాటక కర్తలేకాక నటకులు కూడాను. చిత్రనళీయములో బాహుకుడు, విషాదసారంగధరములో రాజనరేంద్రుడు, పాదుకాపట్టాభిషేకములో దశరథుడు, అభిజ్ఞానమణిమంతములో దుష్టబుద్ధి, ఈ పాత్రములు ప్రత్యేక ప్రశంసాపాత్రములుగా నటించెడివారు. దశరధ పాత్రధారిత్వమున కృష్ణమాచార్యులవారికి సాటి కృష్ణమాచార్యులవారే యని పలువురు చెప్పుకొందురు. ఆచార్యులవారు తమ మరణము నాటక రంగముననో న్యాయస్థానముననో యుండునని యప్పు డప్పు డనుచుండువారు. అది తధ్యముగ వారు 1912 లో నొక యభియోగము నడపుటకు వెళ్ళి ‘ఆలూరు ‘ లో న్యాయస్థానమున నాకస్మికముగ గాలు జారిపడి ‘రామచంద్రా’ యనుచు నసువులు బాసిరి. వారి మృతకళేబరము నాలూరునుండి బళ్ళారికి దెచ్చి యంత్యక్రియ నడవు సందర్భమున జరిగిన యూరేగింపుటుత్సవము పలువు రిప్పటికి చెప్పుకొందురు. నాటకాచార్యుడై గడించిన కీర్తియు, న్యాయవాదియై సంపాదించిన పేరును నాడు ప్రకటితమైనవి. స్త్రీలు పురుషులు వృద్ధులు యువకులు నొక రననేమి, వేలకొలది పుష్పమాలికాదులచే నాచార్యకవి కంత్యసమ్మాన మొసంగిరి. ఇట్టి మహాశయుని శక్తి యుక్తులు ముచ్చటించు కొందముగాక !

కృష్ణమాచార్యులవారి తండ్రిగారు మంచి పండితులు. తాత ముత్తాతలుకూడ విఖ్యాత విద్వాంసులు. తండ్రిగారు బళ్ళారి “వార్థ లా కాలేజి లో నాంధ్ర పండితపద మలంకరించిరి. జనకుని సన్నిధినే కృష్ణమాచార్యుడు సంస్కృతాంధ్రములు కఱచెను. మేధాశక్తి గొప్పది యగుట నిట్టే చక్కని సాహిత్వమలవడుట తటస్థించినది. దానివలన బహుగ్రంథపరిశీళనము గావించి పాండిత్యమునకు స్వయముగా మెఱుగు పెట్టుకొనెను. అష్టశతావధాన ప్రదర్శనము గావించి కొక్కొండ వేంకటరత్న మహా మహోపాధ్యాయుని వంటి వారిచే మెప్పుల గాంచెను. అదియటుండ, నీయన కాంగ్ల భాషాభ్యాసము చేయవలయునని అభినివేశము కలిగినది. పట్టుదల గలవారగుట ఎవ్.ఏ పరీక్షలో నుత్తీర్ణత నందిరి. తరువాత అదవాని ‘తాలూకాకచేరీ’ లో గొన్నాళ్ళు లేఖకులుగా గుదరవలసి వచ్చినది. కవికి దౌర్గత్యముకూడ నొకకళ యైనదిగదా ! పాపము నాటికి వీరిది పేదకుటుంబము. ఆదవానిలో సంసారము సరిగ జరుగక బళ్ళారికి వచ్చి కంటోన్‌మెంటు మేజస్ట్రేటు కోర్టు లో ప్రైవేటు వకీలు ‘ గా పనిచేయ మొదలిడిరి. ఆయుద్యోగము వీరి దరిద్ర దేవతను దఱిమివైచినది. వకీలు వృత్తి యందు వీరికి లభించిన యుత్తేజనము ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుషిప్ పరీక్షకు బురికొల్పి యందుత్తీర్ణుని గావించెను. నాటినుండి వీరి న్యాయవాదవృత్తి నిరాఘాటముగ సాగి న్యాయస్థానమున కెక్కు నభియోగము లన్నిటను వీరి దొక పక్ష ముండి తీరునంత యున్నతికి గొంపోయెను. ప్రతిపక్షులను సాక్షులను ప్రశ్నించుటలో వీరినేర్పు గొప్పది. వీరి వాదము వినుటకు బ్రజలు గుమిగూడి యుండువారట. బళ్ళారి ప్రాంతీయు లిప్పటికిని వీరి న్యాయవాద దక్షత వేనోళ్ళ జెప్పుకొందురు.

ఈయాచార్యకవి యద్భుత మేధాశక్తి యెన్నో కళలను గ్రహించినది. ఆయుర్వేదము వీరు లెస్సగ నెఱుంగుదురు. అది వీరి వంశపారంపర్యముగ వచ్చు విద్య. నాడీపరీక్షలో నీయన సిద్ధహస్తులట. జ్యోతిశ్శాస్త్రమునను వీరి ప్రవేశము చాల గొప్పది. వారి నాటకములలో నిందులకు నిదర్శనములు పెక్కుగలవు. చదరంగ మాడుట యన్న వీరికి చెప్పరాని మక్కువ. నెలల తరబడి యనన్య మనస్కులై యాడుచుండువారని ప్రతీతి. అభినయశాస్త్రము వీరికి బరిచితము. డిబేటింగు సొసైటీ నొకటి స్థాపించి పలువురు పురప్రముఖులనందు సభ్యులుగా జేర్పించి ‘షేక్సుపియరు ‘ నాటకములలో ముఖ్యపాత్రల నభినయించెడి వారు. ఆ సరసవినోదినీసభకు నాడు పెద్ద ప్రఖ్యాతి వచ్చినది. నాటకబృందముపై గల దొల్లిటి హేయభావము తొలగించిన దీసభయే. ఈ సభామూలమున నొకసారి ‘ఆంధ్రకవిపండిత సంఘ సమ్మేళ ‘ మాచార్యులవా రతి విజృంభణముగా జరిపిరి. మఱొకసారి ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావుగారి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణ ‘ కృతిసమర్పణోత్సవమునకు వీరి నధ్యక్షులుగా నెన్నుకొనిరి. అప్పుడు వీరి ‘పాదుకా పట్టాభిషేకము ప్రదర్శింపగా రూ. 1500 వచ్చినవి. అవి కోదండ రాముని కైంకర్యమునకే యర్పింప బడినవి. వీరి నాటకములకు బ్రజాసామాన్యములో గల గౌరవమునకిది మంచి తారకాణ. అంకములలోని కథ రంగములుగా విభజించుట వీరి నాటకములలోని క్రొత్తపద్ధతి. ఇది పాశ్చాత్య సంప్రదాయము. నాటకము విషాదాంతము చేయుట వీరి కనభీష్టము కాదు. ‘సారంగధర ‘ ను జూచిన మనకది యవగతము. కాళ్ళు చేతులు విఱుగ గొట్టబడి సారంగధరుడు చనిపోయెను. అంతతో నాటకము సమాప్తము. మఱియొక సంప్రదాయముగల కవియైనచో నిది యిట్లు వ్రాసి యుండడు. ఇదియు నాంగ్లేయమే. సారంగధరునిపై నిందమోపిన చిత్రాంగిని విచారించుటకు రాజనరేంద్రుడొక న్యాయస్థానసభ చేసెను. అది సరిగ నినర్గసుందరముగ నుండి కృష్ణమాచార్యులు గారు గొప్ప న్యావాదియని సాక్ష్యమిచ్చు చున్నది.

వీరి నాటక చక్రములో ‘చిత్రనళీయము ‘ మిన్నందిన ప్రఖ్యాతి గొన్నది. అందలి పద్య గద్యములు ప్రబంధములకు దీటు వచ్చినవి. అది ప్రదర్శించుట కొక పాటినటకుడు పనికిరాడు. సంపూర్ణమైన యర్థజ్ఞానము కలిగిన మరల నిట్టి కవిత్వము వ్రాయ గలనన్నవాడు వీరి నాటకములు నోట బట్టగలడు. తెలుగులో ననువాదములు రెండుమూడు తప్ప స్వతంత్ర నాటకములు రచించు నలవాటు నాటికి లేకుండుటచే బ్రాబంధిక వాసన వీరి నాటకములలో నననేల, ఆనాడు వ్రాసిన నలుగురైదుగురు కవుల నాటకములలో గూడ వెల్లి విరిసినది.

ఆచార్యులు గారి చిత్రనళీయము చూడుడు. ప్రథమాంకములో స్వయంవరరంగమున భారతిచేత దమయంతికి భుజంగ ప్రయతాదులైన యెన్ని ప్రాబంధిక వృత్తములతో జెప్పించెనో ! ఇప్పుడు బొత్తిగా నాటకములలో బద్యములను బరిహరింపవలయు ననుచున్నారు, అది యౌచితీపోషక మని – అటువంటి యిప్పుడు పృధ్వీవృత్తములు – మత్తకోకిలములు దృశ్యకావ్యములలో నుపయోగించుట యొకరకముగానుండును. నాటినటకులుకూడ సర్వసమర్ధులు ఇప్పు డిట్టివి యాడువారు నూటికి గోటికిని – ఇంచుమించుగా శ్రీనివాసరావుగారివి, కృష్ణమాచార్యులు గారివి కూడ బద్యనాటకప్రాయములు. అడుగడుగునకు బద్యము. తిరుపతి వేంకటకవుల పాండవనాటకములలోను పద్యములపా లెక్కువయే. కానివారు కొంతశైలి తేలికపఱిచిరి.

చిత్రవళీయము చతుర్థాంకములో “శరద్రాత్రి” ని వారివారి యుపాలంభనములు యిరువదియైదు పద్యములలో నాచార్యులవారు వర్ణించి వైచిరి. నిజముగా నాపద్యము లే వసుచరిత్రాది ప్రబంధములకునందని యుదాత్తభావములు కలవి. భాషయు నట్టిదే. విరహ వ్యధావిధురుడైన బాహుకభూమికాధారి యొక్క పెట్టున నాపద్యములు చదువవలయునన్న డొక్క బ్రద్దలగును. నాటి నటకులు కాబట్టి చిత్రవళీయాదుల కంత ప్రఖ్యాతి ప్రజాసామాన్యములో గూడదీసికొని రాగలిగిరి. నటకులై ఖండాంతర ప్రసిద్ధిగాంచిన తాడిపర్తి రాఘవాచార్యులుగారికి మనఆచార్యులుగారు మేనమామ. వీరి నాటకపద్యములు చాలమందికి నోటికి వచ్చినవే యై యుండును. అయినను రెండుమచ్చు:

అతిమాత్రంబుగ దు:ఖమున్ సుఖము దైవాతీనతం గర్మ సం

గతిమై బ్రాణికిగల్గుగా యిపుడు దు:ఖప్రాప్తి మల్లాడె శ్రీ

యుతుడాభూభూరమణుండు వెండియును నేడోఱేపో యాకాల దు

స్థితి దీఱంగను సర్వసౌఖ్యముల నిశ్చింతాత్మీతం జెందడే?

 

బళి రే కంటినిగంటి సప్తజలధి ప్రావేష్టితాఖండ భూ

లలనాధీశ కిరీట వారిరుహరోలంబాయమాస ప్రభో

జ్జ్వలితారిందమనూపురాత్త సదసేవాప్రీతగోత్రాధవున్

నళభూమీధవు నాశ్రితౌ ఘ కరుణా నవ్య ప్రభామాధవు

———-

ధర్మవరం రామకృష్ణమాచార్యులు (నమూనా రచనా )

విషాద సారంగధర నాటకము

ప్రస్తావన

(ప్రవేశము :నటుడు )

శా . శ్రీరాజీవ దళాక్షి  తా నురమునన్ జెన్నొంద లోకాళులన్

    స్మేరాంకూరమునన్  గృతార్దులయి రాజిల్లంగజేయంగ దా

    బ్రేరేపించుచు భక్త సంతతి గృపన్ బెంపొందగా జేయు నా  

    సారంగాననుడిచ్చు గావుత  మహైశ్వర్యంబు  లెల్లప్పుడున్ .

                               (అనుబంధము – 1 )

లోకమున కంతయు క్షేమము గలుగనీ . నటి !ఇటు రమ్ము .

                       [ప్రవేశము :నటి ]

నటి : ఏమి సెలవు ?

నటు :నేడు సరస  వినోదముగా జేయబడిన విషాద సారంగధర మను నాటకము నభినయింప వలయు గదా ? పాత్రలన్నియు సిద్ధమయినవా ?

నటి : కొదవయేమి ? అంతయు సిద్ధమయినది . ఈ పండిత మండలి వలె నాదరించు వారుండవలయుగాక , యెట్టి  నాటకములు వెలువడలేవు ?

నటు : కానిమ్ము . ఇంకాలస్యమగును . నీ గాన వైశద్యము  వినగోరి యీ  సదస్యు లెదురుచూచుచున్నారు . ఏదీ ! ఏదైననొక  కృతి నుగ్గడింపుము .

నటి :ఆర్య ! ఏ ఋతువును   గురించి  వర్ణింతును ?

నటు : నేడు ఋతువేమియువలదు . ఇప్పుడు రాగల మాళవరాజగు రాజ నరేంద్రుని సభని వర్ణింపుము .

నటి : కం . తనరారెడు  ఘనతేజో

            దిననాధుడు  రాజరాజు ధీరవరుడు భూ

            జన మాగధ జన సంతతి

            మనసారగ  సంస్తుతింప మానితు డగుచున్ .

(అనుబంధము – 2 )

కం . కులశేఖరు లల సచివులు

    బలు మంత్రము లొసగుచుండ  బరమానందం

    బలరారగ  గలవాణులు

    కలగాన మొనర్చుచుండ ఘనవిభవమునన్.

నటు : ఆహా ! కామినీ ! నీ గానము నవీనము , అనూనము, ప్రవీణము , అసమానము .

కం . అలివేణి ! నీ మనోహర

     కలగాన మనూన మిందుగలవారికి ని

      య్యలరారు గానమాధురి

      తల లూపగజేసె వికచతామరసా !

ఇంక బోవుదము రమ్ము .                                              (నిష్క్రమింతురు)

                                           ఇది ప్రస్తావన .

విషాద సారంగధర నాటకము

పూర్వ రంగము

[ప్రవేశము : హిరణ్యుడను బ్రాహ్మణుడు]

(అనుబంధము – 3 )

హిర : నాకేమో వేయి వరహాలు చిక్కినవి . ఇట్లు గదా యుండవలయు ? ఇరువది దినములలో నింత సంపాదించితిని . ఇట్లే నిత్యమున్న బంగరు గోడలు వజ్రముల మేడలు కట్టవచ్చును . మా రాజనరేంద్ర రాజు బోలిన యుదారు డెందైన గలడా ? తన కొడుకు సారంగధరునికై కన్యల నన్వేషించుట కొఱకు  దేశదేశములకు బ్రాహ్మణుల నంపెను . నేను విదర్భ రాజపుత్రిక యగు చంద్ర కళా దేవి పటమును దెచ్చితి . మా విభావసుడు  భోజరాజ పుత్రికయగు చిత్రాంగిదేవి పటము దెచ్చెను . మా యిరువురికి వేయి వరాల నిచ్చి నాడుగా ! భలా ! భలా ! రాజరాజు వేయేండ్లు బ్రతుకనీ ! సారంగధరున కింకొక నాలుగు పెండిండ్లు  కానీ . ఇదిగో ! విభాసు డిక్కడికే వచ్చునట్లున్నది .

                                                                        (ప్రక్కకు బోవును )

                       [ప్రవేశము : విభావసుడను బ్రాహ్మణుడు ]

                                   (అనుబంధము -4)

విభా : ఆహా ! మరల  వేయి వరహాలు వచ్చునట్లున్నది . ఏమి నా పుణ్యము ! హిరణ్యుడెక్కడ నున్నాడో ?

హిర : (ముందరికి  వచ్చి ) ఇక్కడనే యున్నాడు . మిత్రమా ! మరేమీ  విశేషము ?

విభా : హిరణ్యా ! ఏమని చెప్పవలెను ? రాజు మరల నీనాడు నన్ను బిలిపించి నీకు నాకు జెరి వేయి వరహాలు వచ్చు విషయము  చెప్పియున్నాడు .

హిర : అదియేమి ?

విభా : మరల నీవు విదర్భకు నే భోజపురికిం బోయి చంద్రకళను  సారంగధరునకు చిత్రాంగిని దనకు నిశ్చయించి రావలయునట .

హిర :  భళిరె  భళిరె  (అని గంతులు వేయును )

విభా : అయిన నాకొక్కటి మాత్రము చింతాకరముగా నున్నది . మనము తీసికొనిపోయిన చిత్ర పటమును జూచినది మొదలు చిత్రాంగి సారంగధరునే కెంతెంతో చెప్పమన్నది . నిన్ను గాకింకొక్కని బతిగా బడయనని విన్నవింపు మన్నది . ఆమె కెంతాశాభంగము  గలిగెను !

హిర : మఱి నీవు సారంగధరునితో నిది చెప్పితివా ?

విభా : వల్లకాడు ! వేయి వరహాల సంభ్రమముననె నా ప్రొద్దంతయు బోయినది .

హిర : మఱి యిప్పుడు చిత్రాంగి రాజరాజు నెట్లు పెండ్లియాడును ?

విభా : ఎట్లు ? మన యాంధ్ర రాజు సామాన్యుడా ? అతడు కోరగా వలదని యువరాజు నెవతెయైన బెండ్లి యాడునా ? అదిగాక భోజరాజు మన రాజున కాంతరితుడు . బలవంతమునైన  బెండ్లి చేసి యిచ్చును .

హిర : అయిన నిప్పుడు చిత్రాంగి యొద్దకు బోయెదవు కదా  ఆమె సారంగధరుని నా విన్నపము చెప్పితివా యన్న నేమి చేయుదువు ?

విభా : ఆమెను జూడనేచూడను . విధి లేక చూడవలసి వచ్చెనా  యేదోయొక బొంకు బొంకెదను. ఇప్పుడిదియేల ? మనకు బ్రొద్దుబోయెను . పోవుదము .

                                                                                (నిష్క్రమింతురు)

విషాద సారంగధర నాటకము

ప్రధమాంకము

ప్రధమరంగము

రాజరాజనరేంద్రు నాస్థానము

[ప్రవేశము : నయార్ణవ, నీతిజ్ణ , మతిమంతులు ]

మతి :నీతిజ్ఞా ! నయార్ణవా ! మన రాజుగారి శిరశ్శూల యిప్పడెట్లున్నదని తెలిసినది ?

నీతి : మతిమంతా ! నీవు వినలేదా ? నేడుదయముననే నయముగా నున్నదని చిత్రాంగి దేవితో గ్రీడించుచుండిరనియు వింటిమి . నయార్ణవా ! అదేమిటికి దేవితో సారంగధరుని నాస్థానమునకు రమ్మని యన్నారట !

నయా : అదియేమో తెలియకున్నది . మతిమంతా ! నీ  వేమైన నెరుగుదువా ?

[ప్రవేశము : సేవకుడు .]

సేవ : అమాత్య చంద్రులారా ! యువరాజుగారు విచ్చేయుచున్నారు .

(అందఱు  లేచెదరు.)

[ప్రవేశము :సారంగధరుడు , సుబుద్ధి .]

సారంగ : మతిమంతా ! నన్నెందులకు రాజుగారు పిలిపించియున్నారు ?

మతి : ప్రభూత్తమా ! ఇపుడే తెలియగలదు .

సారంగ : సుబుద్దీ ! కూర్చుండుము .(తండ్రికి నమస్కరించి సుబుద్ధి కూర్చుండగా ) మతిమంతా ! నయార్ణవా ! నీతిజ్ఞా ! మీకందఱకు గుశలమా ?

మతి : జగద్విదిత పరాక్రమాంచితుడై ధరాపాలనము సమబుద్ధి నొనరించుచున్న రాజ నరేంద్రుని కొలువున నున్న వారిని “క్షేమమా “ యని యడుగ వలయునా ? యువరాజా ! నీకు సంతోషమే కదా ?

సారంగ : మతిమంతా ! నా తండ్రి నాకేమిట గొదవ చేసియున్నాడు ? అదిగాక చతురపాయధురీణడనియు, రాజనీతివిదుడనియు , అతీతానాగతదురూహ సర్వవిచార పరిణతుడనియు బేరున కెక్కిన నీ  యట్టి వానికి దగిన కుమారుడని వాసి జెందిన యీ  సుబుద్ధి నాకు సంతతసఖుడై  యుండుట వలన నా భాగ్యమునకు మేరయే లేదు .

 

రచయిత : ధర్మవరం రామకృష్ణమాచార్యులు

సేకరణ : విషాద సారంగధరము , నాటకము  నుంచి 

———–

You may also like...