పేరు (ఆంగ్లం) | K.Shivareddy |
పేరు (తెలుగు) | కె.శివారెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | తులశమ్మ |
తండ్రి పేరు | వెంకట సుబ్బారెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 08/06/1943 |
మరణం | – |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా లోని కార్మూరివారిపాలెం గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రక్తంసూర్యుడు (1973) – ఝరీ పొయెట్రీ సర్కిల్, చర్య (1975) – ఝరీ పొయెట్రీ సర్కిల్, గాథ, ఆసుపత్రిగీతం (1976) – ఝరీ పొయెట్రీ సర్కిల్, భారమితి (1983) – ఝరీ పొయెట్రీ సర్కిల్, ఆమె ఎవరైతే మాత్రం (2009) – పాలపిట్ట బుక్స్ వృత్తలేఖిని (2003) – ఝరీ పొయెట్రీ సర్కిల్, నేత్ర ధనస్సు (1978) – ఝరీ పొయెట్రీ సర్కిల్, మోహనా! ఓ మోహనా! (1988) – ఝరీ పొయెట్రీ సర్కిల్, అజేయం (1994) – ఝరీ పొయెట్రీ సర్కిల్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కబీర్ సమ్మాన్ (జాతీయ పురస్కారం) – (2017, నవంబర్ 10న భోపాల్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా) ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు కవి శివారెడ్డి, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు – 1974 రక్తసూర్యుడు కవితా సంకలనానికి, తెలుగు యునివర్సిటీ అవార్డు, విశాల అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం -1990 లో మోహనా! ఓ మోహనా! కవితా సంకలనానికి. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కె.శివారెడ్డి |
సంగ్రహ నమూనా రచన | – |
కె.శివారెడ్డి
కె.శివారెడ్డి సుప్రసిద్ధ వచన కవి. అభ్యుదయ కవి. విప్లవకవి. 1943, ఆగష్టు 6 వ తేదీ గుంటూరు జిల్లా లోని కార్మూరివారిపాలెం గ్రామంలో జన్మించాడు. కూచిపూడి లోని హైస్కూల్‌లో ఎస్.ఎస్.ఎల్.సి దాక చదివాడు. తెనాలి లోని వి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో పి.యు.సి., డిగ్రీ, ఆంధ్రయునివర్సిటీలో ఎమ్.ఏ. (ఆంగ్లం) చదివాడు.1967 నుంచి వివేకవర్థిని కళాశాల హైదరాబాదులో లెక్చరర్‌గా పనిచేసి 1999లో ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశాడు. 2006 బుక్‌ఫెయిర్ సందర్భంగా భారతదేశం తరపున ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకడిగా వెళ్లి వివిధ నగరాలలో, వివిధ సమావేశాలలో కవిత్వం వినిపించాడు. తన విప్లవకవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించాడు. ఈయన కవితలు సుదీర్ఘంగా వుంటాయి. పునరుక్తుల్ని కూడా బాగా కలిగి వుంటుంది. సామాజిక అంశాల్ని ఆయన పదేపదే ఆలోచించి కవితాబద్దం చేస్తాడు. వేకువ అనే త్రైమాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు.
ప్రముఖ తెలుగు కవి, సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కె. శివారెడ్డి సాహిత్య కృషికిగానూ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘‘కబీర్ సమ్మాన్’’ వరించింది. భోపాల్‌లో జరిగే సాహిత్య సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకుంటున్న తొలి తెలుగు కవి శివారెడ్డి కావడం విశేషం. మొదటిసారి తెలుగు కవిని ఈ అవార్డు వరించడంతో తెలుగు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ‘ఆరు దశాబ్దాలుగా కవిత్వమే జీవితంగా బతుకుతున్న కె. శివారెడ్డికి కబీర్ సమ్మాన్ అవార్డు దక్కడం తెలుగు కవులందరికీ నిజమైన పండుగ’’ అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి కొనియాడారు. శివారెడ్డికి బీసీ ప్రణాళిక సంఘం సభ్యులు, ప్రముఖకవి జూలూరి గౌరీశంకర్ అభినందనలు తెలిపారు.
వెన్నెల
ఆమె కళ్ళ నిండా
నీళ్ళు పెట్టుకుని అడిగింది
‘నా సంగతేమిటని’
నేను గుండె నిండా
దుఃఖాన్ని నింపుకుని అడిగాను
‘నా సంగతేమిటని’
ఇద్దరం ఫక్కున నవ్వాం
ఇద్దరి కళ్ళ నుంచి
వెన్నెల్లా వర్షం కురిసింది.
పిలవటం తప్ప
దారి పక్కన నుంచుని
ఒకడు చెయ్యూపుతాడు
నాకా, ఈ ప్రవాహానికా అర్ధం కాదు
నేలలోపలి నీటిని
ఒక వేరు తట్టిలేపినట్టు
ఒక రాతిగోడ పక్క
ఒకే ఒక మొక్క విరగబూస్తుంది.
….
….
దారిపక్కన నుంచుని
పిలుస్తుంటాడొక బాలుడు
పిలవటం తప్ప
అతనికింకేం పని లేనట్టు
సొరంగం
నాకొక దోవ ఉంది
నేనందులో దూరిపోతా
కానీ, ఆమెకేముంది
దారుల్లేని చీకటి
….
….
తప్పదు
ప్రతి ఒక్కడూ
బతుకులో బయటపడే
ఒక సొరంగం వెతుక్కోవాలి
ఆమెకలదు
ఏం చేస్తావు ఆమెని
ఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవా
నీ రెండు కళ్లను పీకి
ఆమె అరచేతుల్లో పెట్టగలవా
ఎన్నో జన్మల నుంచి నడుస్తున్న
ఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవా
ఏం చేస్తావు ఆమెని
నాలుక చివరతో ఆమె కంట్లోని నలకను తీయగలవా
గుండెలో విరిగిన ముల్లును
మునిపంటితో బయటికి లాగగలవా
భూమిపొరల్లో ఖనిజంగా ఉన్న
ఆమెను తవ్వి తలకెత్తుకోగలవా
చిన్నపిల్లలా భుజానెక్కించుకుని
విశ్వమంతా ఊరేగించగలవా
ఏం చేయగలవు నువ్వు
చెదిరిన ముఖంగలవాడివి
చీలిన నాలుకలవాడివి
తలాతోకా తెలియని
మొండెపుతనంతో ఊరేగుతున్నవాడివి
రహస్య సంకేతాల కేంద్రమయిన ఆమెను
ఛేదించగలవా చదవగలవా
చిరుమువ్వల పువ్వులు ధరించి
తిరుగుతున్న ఆమెను వినగలవా
వీనులతో చూడగలవా
ఆమెనేం చేయగలవు
‘అడవి ఉప్పొంగిన రాత్రి’లాంటి ఆమెను
అందుకోగలవా అనువదించగలవా
ఆరుబయట వెన్నెట్లో
అమోఘంగా చలించే ఆమెను
తాకగలవా, తాకి తరించగలవా –
ఆమె ముందొక శిశువై
దిగంబరంగా నర్తించగలవా
ఆమె గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించగలవా
ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి సేదదీరగలవా
నీ అస్తిత్వాన్ని మర్చిపోయి
ఆమె అస్తిత్వాన్ని గుర్తించగలవా
ఏం చేయగలవు
ఏం చేయలేని వెర్రిబాగులాడా
వెదకటం తెలియాలిరా
మనుషుల్లో మనుషుల్ని వెదకటం తెలియాలిరా
నీలో నువ్వు కొట్టుకుపోతున్న నిన్ను
ఆమె రక్షించగలదు
ఆమె కలదు, నువ్వు లేవు.
(ఆమె ఎవరైతే మాత్రం కవితా సంకలనం నుండి)
———–