పేరు (ఆంగ్లం) | Vatsavayi Venkata Neeladriraju |
పేరు (తెలుగు) | వత్సవాయి వేంకటనీలాద్రిరాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | వేంకట సీతారామరాజు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1881 |
మరణం | 1/1/1939 |
పుట్టిన ఊరు | మోడేకుఱ్ఱు |
విద్యార్హతలు | – |
వృత్తి | ప్రముఖ కవి, శతావధాని మరియు విమర్శకుడు. |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంధ్రక్షత్రియులు (విమర్శనాత్మకము. 1920 ముద్రి.), ఆంధ్రమేఘసందేశము (1912 ముద్రి) , అభిజ్ఞాన శాకుంతలము (1933 ముద్రి), విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము (ఆముద్రితములు). |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవిరాజు, కవిభూషణుడు |
ఇతర వివరాలు | ఈక్షత్రియకవి, మోడేకుఱ్ఱు సంస్కృత పాఠశాల పండితులు ఆకొండి వ్యాసలింగశాస్త్రి గారి సన్నిధానమున సంస్కృతాంధ్రసాహితి సంగ్రహించెను. పాణినీయమునను గొంత ప్రవేశము కలిగించుకొనెను. కవిత్వము మంచి చిక్కని పలుకుబళ్లతో నుండి చక్కగ నడపింపగల నేర్పరు లీయన. పెద్దన, తిమ్మనార్యుడు మున్నగువారి శైలి వీరి కవిత కొరవడి. భాష నిర్దుష్టము, శిష్టసమ్మతముగ నుండును. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వత్సవాయి వేంకటనీలాద్రిరాజు |
సంగ్రహ నమూనా రచన | ఈ నీలాద్రిరాజుగారికి దేశములో గవిరా జని ప్రసిద్ధ వ్యవహారము. ఈయన తిని సంస్థాన విద్వత్కవి. రాజులలో గవి యగుటయు గాక, కవులలో రాజగుటయు నీయనకు గవిరాజబిరుదము చరితార్థ మయినది. ఈ పద్యము వీరి వంశాది విశిష్టతను విస్పష్టపఱుచును. |
వత్సవాయి వేంకటనీలాద్రిరాజు
ఈ నీలాద్రిరాజుగారికి దేశములో గవిరా జని ప్రసిద్ధ వ్యవహారము. ఈయన తిని సంస్థాన విద్వత్కవి. రాజులలో గవి యగుటయు గాక, కవులలో రాజగుటయు నీయనకు గవిరాజబిరుదము చరితార్థ మయినది. ఈ పద్యము వీరి వంశాది విశిష్టతను విస్పష్టపఱుచును.
సీ. రాజకేసరివర్మ రాజేంద్రచోళాది
జనపతుల్ కూటస్థ జనులు మీకు
భూలోక వైకుంఠాకవులు రంగ వేంకటే
శ్వరు లన్వవాయదైవములు మీకు
తెలుగురాయనరేంద్ర తిమ్మరాయన జగ
త్పతు లన్వయప్రదీపకులు మీకు
భగవత్పద ధ్యాన పర విశిష్టాద్వైత
మత మన్వయక్రమాగతము మీకు
గీ.ననికి వెనుకంజ వేయక యనుతృణములు
వదలి దివిచూఱకోలు సద్ర్వతము మీకు తళుకుకనకంబునకు బరీమళము వోలె కావ్యనిర్మాణ మతి యశస్కరము మీకు.
ఆంధ్ర మేఘసందే శావతారికలో గవిరాజుగారు తమ సహాధ్యాయనిచే జెప్పించుకొన్నటులు వ్రాసిన పద్యమిది.
ఈక్షత్రియకవి, మోడేకుఱ్ఱు సంస్కృత పాఠశాలా పండితులు ఆకొండి వ్యాసలింగశాస్త్రిగారిసన్నిధానమున సంస్కృతాంధ్రసాహితి సంగ్రహించెను. పాణినీయమునను గొంత ప్రవేశము కలిగించు కొనెను. కవిత్వము మంచి చిక్కని పలుకుబళ్లతో నుండి చక్కగ నడపింపగల నేర్పరు లీయన. పెద్దన, తిమ్మనార్యుడు మున్నగు వారిశైలి వీరి కవిత కొరవడి. భాష నిర్దుష్టము, శిష్టసమ్మతముగ నుండును. కాళిదాసుని యభిజ్ఞాన శాకుంతలము, మే ఘసందేశము ననువదించి వెలువరించిరి. విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము కూడ దెనిగించిరని తెలియ వచ్చును గాని యచ్చుపడలేదు.
కాళిదాసుని ప్రతికృతికి నెన్నో పరివర్తనములున్నవి. అందులో నభిజ్ఞాన శాకుంతలమునకు మన తెలుగులో బేరుపడిన యనువాదములు పదిపదు నైదుదాక నున్నవి. శ్రీ పరవస్తు రంగాచార్యులుగారు [వీరిది రెండంకములు మాత్రమే ‘సకలవిద్యాభి వర్ధనీపత్రిక’ లో వెలువరింపబడినది], కందుకూరి వీరేశలింగము గారు, వేదము వేంకటరాయశాస్త్రి గారు, రాయదుర్గము నరసయ్య శాస్త్రిగారు, దాసు శ్రీ రామకవిగారు, వడ్డాది సుబ్బారాయుడుగారు, నిడమర్తి జలదుర్గా ప్రసాదరాయడుగారు, మంత్రిప్రెగడ భుజంగరావుగారు, కాంచనపల్లి కనకమ్మగారు, పేరి కాశీనాథశాస్త్రిగారు, వీరెల్లరును శాకుంతలాపరివర్తనకర్తలు. తరువాత మనకవిరాజుగా రొకరు. వీరితెలుగుసేతలో విశేషములు రెండున్నవి. కేవలము మూజానుసారముగ ముక్కకుముక్క తెలిగింపక వ్యాఖ్యానసాహాయ్యమున భాష్యప్రాయముగ బెంచి రచించుట యొకటి. సంస్కృతమునను, దెనుగునను దొల్లి ప్రచురితములగు ప్రతులన్నియు బట్టిచూచి, పాఠభేదములు, ప్రక్షిప్తప్రదేశములు లెస్సగ బరికించి పూర్వాపర సందర్భములు తాఱుమాఱు గాకుండ జేయుట రెండవది. కవితాధార సంగతి వేఱే చెప్పనేల ? ఈతీరున జాలువాఱుచుండును.
సీ.రాలియున్న యవి కీరముల తొఱ్ఱలనుండి
చెదరి నీవారముల్ చెట్లక్రింద
తెలుపు చున్నయ వింగుదీ ఫలోద్భేదంబు
జిడ్డులై యందంద దొడ్డశిలలు
మెలగు చున్న యవి నమ్మికతోడ నెప్పటి
పగిది శబ్దముసైచి మృగములెల్ల
కలిగియున్నయవివల్కల శిఖానిష్యంద
రేఖాంకముల నీళ్ళ రేవుదార్లు
మాఱియున్నవి యాజ్యధూమంబువలన
జివురుటాకుల కాంతులు చెన్నుదరిగి
తోగియున్నవి గాడ్పుల దొలకి పాఱు
బోదియలనీళ్ళ బాదపంబుల మొదళ్ళు ‘ప్రథమాంకము’
ఉ. ఘ్రాతముగాని పుష్పము, సఖంబుల ద్రుంపని పల్లవం బను
న్యూతముగాని రత్నము రుచుల్గయికోని నవాసవం బఖం
డాతత పుణ్యసత్ఫలము నట్లనఘమ్మగు నాలతాంగి రూ
పాతిశయంబు నెవ్వనికి నంచు విరించి సృజించి యుంచెనో?
కవిరాజుగారి మేఘసందేశపు దెలుగు సేతలోని మచ్చు పద్యములు మఱి రెండు: శా. ఆవీట న్నడిరేయి వీథిబడి కాంతాగారమున్ జేరు న
ప్పూవుంబోణుల కల్లిబిల్లిగొని చూపున్ మాపు పెంజీకటిన్
నీ వెంతే నొరగంటి పై డితళుకున్నిద్దంపు క్రొమ్మించునన్
ద్రోవంజూపుము వారలుల్కుదురు చిన్కున్ మ్రోతలేకుండుమీ!
ఉ. పై దలిబాసె వీడను గృఫామతి కల్మినొ లేక చెల్మినో
కాదన కిట్టిపాటియుపకార మొనర్చి మదర్థనంబు మై
నాదట నిచ్చవచ్చు నెడలందు జరింపుము కార్బెడంగుతో
లేదవుగాక క్రొమ్మెఱగు లేమవియోగము నీకు వ్రేల్మిడిన్.
కవిరాజుగారు చట్టవిరుద్ధము-కూర్చొని మున్నగు నెరసులు కొన్ని శాకుంతల కవితలో దొరలించిరి. ఆనాటకములో నీచ పాత్రోచితమైన వాడుకభాష యెంతసొగసుగ నడ్చినదో?
క. ఇల నెంత చెడ్డదైనను
కులవృత్తిని విడిచిపెట్ట గూడదుగందా?
తలచుదుము చదుముకొని మే
కల జంపే బావనయ్య కటికోడయ్యా!
నీలాద్రిరాజుగారు పెద్దాపురమురాజ్యమును బరిపాలించిన శ్రీ రాజా వత్సవాయి వేంకటసింహాద్రి జగత్పతీంద్రుని యాదరమున దుని సంస్థాన కవిగానుండి పేరందెను. తునిరాణి శ్రీ సుభద్రాంబిక యీకవిని బహుగౌరవముతో జూచినది. నేటి తునిరాజుగారు శ్రీ వత్సవాయి వేంకటసూర్యనారాయణ జగపతిరాజావారి పట్టాభిషేక సందర్భమున బ్రదర్శనము చేయుటకై కవిరాజుగారు శాకుంతల మాంధ్రీకరించినటులు ప్రస్తావనలో నున్నది. శ్రీవారి సంస్థానమున నీయన జేగీయమానముగ శతావధానము గావించెను. ఆంధ్రభారతీ తీర్థవారు ‘కవిభూషణ’ యను బిరుదముతో నీయనను సత్కరించిరి. కవిరాజుగారు తాను శతావధాని నన్న సంగతి యీపద్యములలో బేరుకొనెను. శా. నానాసాధు సభాసదార్య సుమనోనాళీకనాళ ప్రణా
ళీ నిర్వ్యజ నిపీయమాన సువచో లీలామృతా స్వాదనా
పౌన:పుస్యరసోదయుండ సుమన: పద్మైకసంవేశిత
శ్రీ నాథుండ శతావధాన కవితా సింహాసనాధీశుడన్.
మ. తునిరాజేంద్రుశతావధాన కవితాతుష్టాత్ము గావించి యా
యన సమ్మాన విభూతిమై ‘సుకవితాయద్యస్తి రాజ్యేనకి’
మ్మనురీతిన్ గవిరాజటంచును జనం బాబాల గోపాలమున్
వినుతింప న్విలసిల్లువాడ గవితా విద్యానవద్యాకృతిన్.
నీలాద్రిరాజుగారు కవియు, శతావధానియు గాక మంచి విమర్శకుడని ‘ఆంధ్రక్షత్రియులు’ అనిన చిన్నపుస్తకము వలన దెల్లమగును. శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు ‘ఆంధ్రులచరిత్రము’ లో నాంధ్ర దేశమును బరిపాలించిన కాకతీయులు సూర్యవంశక్షత్రియులని తొలుత వ్రాసి, తరువాత జతుర్థకులజులని మరల వ్రాసిరి. పరస్పరవిరుద్ధముగ నిటులు వ్రాయుటకు గారణమేమని యడుగ మొదటిది భ్రమయనియు, రెండవది ప్రమ యనియు బిమ్మట వాదించిరి. అప్పుడు మన కవిరాజుగారు శ్రీ రావుగారి వ్రాతను సప్రమాణముగ గాదని వాదించి కాకతీయులు క్షత్రియులే యని యీ పుస్తకములో దేల్చివ్రాసిరి.
ఈ కూర్పునకు బీఠికవ్రాయుచు విమర్శకాగ్రేసరులు కాశీభట్టబ్రహ్మయ్యశాస్త్రిగారు చిట్టచివర నిట్టులుతమయభిప్రాయము వెలిబుచ్చిరి.
“…ప్రతాపరుద్రాదులు శూద్రులను భ్రమ పల్వురకు గలిగినది. నేనును నందులోని వాడనేగాని శ్రీ కవిరాజుగారు వ్రాసిన యీగ్రంథము చూచినతరువాత నే నిదివఱకు దలచినది తప్పని గ్రహించి దిద్దుకొన వలసినవాడ నయితిని.”
ఈ యుభయవాదములలోని సాధుతాసాధుతలు నిర్ణయించుకొనుటకిది సమయముగాదు. కవిరాజుగారు చక్కని విమర్శన శక్తి కలవారని “ఆంధ్రక్షత్రియుల” వలన బ్రత్యక్షమగును. అదేమనకు బ్రస్తుతవిషయము.
నీలాద్రిరాజుగారు అచ్చతెనుగులోను జక్కని చిక్కని కవిత సంతరింపగలరు. ఈ వృత్తాంత మీ చాటుపద్యము చాటుచున్నది.
ఉ. గూటిపులుంగులన్ మొఱగి కూళతనంబున నేయునట్టి వా
వేటలు గీటలున్ జమునివీటికి బాటలు రాచపాడికిన్
జేటులుగాక మార్తురెద జిందఱవందఱవో రొదన్ దెసల్
బీటలువాఱగాననికి బెండ్లికి బోయినయట్ల పోవలెన్
సూటి కొలందికిన్ దివియ జూచి నిగిడ్చిన మార్తుచేతివా
లీటె తనంత తావలచి యొక్కటిపై బడు పూవుబోడి మే
మీటిన చన్నుదోయి వలె మీదికి రావలెనొక్క పెట్ట పై
పాటున క్రొత్తనెత్రుకలపమ్ములు గ్రమ్మగ బేరురమ్ము నో
నాటవలెం దగం దనమనమ్మున మార్కొని ముమ్మరంపు మై
తీటలువో బెనంగవలె దేనియతేటలవోలె నెత్తురుల్
నోటబడంగ నౌడ్గఱచి మాల్కొనగావలె నీడబోని పో
రాటమునం దొడల్ విడిచి గ్రక్కున నక్కున జేర్చు వేలుపుం
జోటి చనుంగవన్ మిగుల జొక్కవలెస్మఱి పేరసంబుతో
నోటమిలేక తా బ్రతికియుండినచో మగలెల్ల వీడెపో
మేటిమగం డనంగ బుడమిం బసమీఱగ నేలగావలెన్
పాటుపడంగ నొప్పు తమపాడికి జాలక డుక్కిముచ్చులై
కూటికొఱంతలేక తిని కూర్చుని యొండరు నెక్కపక్కెపున్
మాటలనాడికొంచు వెడనవ్వులతోడన ప్రొద్దుపుచ్చి మై
పాటున నెంతయున్ జమునిపాల్పడి పోవగ మేమెమేమెపో
మేటి కొలంబువార మని మీసలు ద్రువ్వెడు రాచవారికిన్
మయ్యెనే యకట! కయ్యముతియ్యము నాడునాటికిన్
ఆంధ్ర రచయితలు నుండి-
———–