చర్ల నారాయణ శాస్త్రి (Charla Narayanasastry)

Share
పేరు (ఆంగ్లం)Charla Narayanasastry
పేరు (తెలుగు)చర్ల నారాయణ శాస్త్రి
కలం పేరు
తల్లిపేరువెంకమ్మ
తండ్రి పేరుజనార్ధనశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1881
మరణం11/27/1932
పుట్టిన ఊరుకాకరపర్రు
విద్యార్హతలు
వృత్తిప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత మరియు విమర్శకుడు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువృషభ శతకము (ఆంధ్రీకరణము), నారాయణీయాంధ్ర వ్యాకరణము, దుతాంగదము (ఆంధ్రీకృతనాటకము), భర్తృహరి నిర్వేదము(ఆంధ్రీకృతనాటకము)
కావ్యాదర్శము, నీలకంఠవిజయ చంపువు, మహాభారత మీమాంస
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుపితామహుని సన్నిధిని కావ్యములు చదువుకొని, ఆకొండి వ్యాసలింగశాస్త్రితో నలంకార గ్రంథములు పాఠముచేసి, రామడుగుల వీరయ్యశాస్త్రి గురువుల దగ్గర వ్యాకరణ మభ్యసించి పండితస్థానము నందెను. సంస్కృతాంధ్రములలో నిశితమైన పాండితీపాటవము. ఈ పాండిత్యమునకు దోడు సంగీతాది కళలలో గూడ జక్కని పరిచయము. మద్దెల వాయించుటయు గురుముఖమున నేర్చినారు. అంతటి కళాభిరుచి ! ఒక చిత్ర మేమనగా, నారాయణశాస్త్రిగారు నాడు ధైర్యవంతుడైన సంస్కారవాది. తణుకులో జరిగిన అస్పృశ్యతా నివారణ మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షత వీరిదే.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచర్ల నారాయణ శాస్త్రి
సంగ్రహ నమూనా రచననారాయణ శాస్త్రిగారు మంచి విమర్శకులు గాను, పండితులు గాను పేరుగాంచిరి. కవిగా వారికి గలపేరు తక్కువ. ఆయన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున బండితాధికారిగా బెక్కునాళ్లు పనిచేసి భారతికి గావించిన సేవ గొప్పవిలువ గలది.

చర్ల నారాయణ శాస్త్రి

నారాయణ శాస్త్రిగారు మంచి విమర్శకులు గాను, పండితులు గాను పేరుగాంచిరి. కవిగా వారికి గలపేరు తక్కువ. ఆయన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున బండితాధికారిగా బెక్కునాళ్లు పనిచేసి భారతికి గావించిన సేవ గొప్పవిలువ గలది.

“మేకాధీశ” శబ్దార్థమున సకలప్రపంచమును జోడించి చూపిన మహావిద్వాంసుడు చర్ల భాష్యకారశాస్త్రి మున్నగువారికి నెలవైన ‘ కాకరపర్రు ‘ నారాయణశాస్త్రిగారి యూరు. ఈయన పితామహుని సన్నిధిని కావ్యములు చదువుకొని, ఆకొండి వ్యాసలింగశాస్త్రితో నలంకార గ్రంథములు పాఠముచేసి, రామడుగుల వీరయ్యశాస్త్రి గురువుల దగ్గర వ్యాకరణ మభ్యసించి పండితస్థానము నందెను. సంస్కృతాంధ్రములలో నిశితమైన పాండితీపాటవము. ఈ పాండిత్యమునకు దోడు సంగీతాది కళలలో గూడ జక్కని పరిచయము. మద్దెల వాయించుటయు గురుముఖమున నేర్చినారు. అంతటి కళాభిరుచి ! ఒక చిత్ర మేమనగా, నారాయణశాస్త్రిగారు నాడు ధైర్యవంతుడైన సంస్కారవాది. తణుకులో జరిగిన అస్పృశ్యతా నివారణ మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షత వీరిదే. ఆసమయము 1925 ప్రాంతము. సహాయ నిరాకరణోద్యమములో వీరు నడుము కట్టి పనిచేసినారు. కాకరపర్రు ‘ పంచాయితీబోర్డు ‘ నకు యాజమాన్యము. తణుకు జాతీయ పాఠశాల కార్యవర్గమునకు అధ్యక్షత. ఇవన్నియు మనము యోచించుకొన్నచో నారాయణశాస్త్రిగారు లౌకిక ప్రజ్ఞావంతులని విశదమగును. పండితుడై యుండి పాఠములు చెప్పుకొనుచు గాలక్షేపము చేయకుండ, రాజకీయముగా గలుగజేసికొనుట వీరి చరిత్రములో గమనింప దగిన సంగతి.

ఆంధ్రవైయాకరణులలో నారాయణశాస్త్రిగారికి గౌరవప్రదమైన తావు ఏర్పడియున్నది. దానికి గారణము వారు శ్రమించి కూర్చిన నారాయణీయాంధ్ర వ్యాకరణము. నన్నయా ధర్వణు లిరువురు సంస్కృతములో సంతరించిన “ఆంధ్రశబ్ద చింతామణి, వికృతివివేకము” అను వ్యాకరణముల కిది తెలుగుగ్రంథము. విశేషము, వీరిది పద్యరూపముగా సంధానించిరి. వారి కుమారులు గణపతిశాస్త్రిగారు దానికి వివరణము వ్రాసిరి. తండ్రి కొడుకుల చేతులమీద నడచిన యీకృషి చూచుటకు ముచ్చటగా నున్నది. నారాయణశాస్త్రిగారి కవితారీతి యీ లక్షణగ్రంథములో నిటులు నడచుచున్నది. మనపూర్వులందరు వ్యాకరణము, ఛందస్సు, తదితర సమస్తశాస్త్రములు పద్యములలోనే నిబంధించి యున్నారు. లక్షణగ్రంథములు పద్యబంధములై యుండుట కవితాధారవాహితకకు మిక్కిలి యడ్డు. కాని, మనవారు శ్రమించి దానికి గొరంత రాకుండ జూచుకొని కొంతవరకు సఫలులైనారు.

క. సకలశ్రేయ స్సాధన

ము కావ్య; మయ్యది యదోషము గుణాలంకా

రకలితము నైన వాగ

ర్థకాయమున నొప్పు; వాక్కురసజీవ సుమీ !

 

క. రసముచెడకుండ నాయా

రసముల కనుగుణము లయిన రసవత్తర వా

గ్వినరంబు తోడ గావ్యము

రసికులు తమకొలది నుడువరాదొకొ దానన్.

గీ. సిద్ధ సాధ్య భేదంబుల జెలగుసున్న

యర్ధ పూర్ణరూపంబుల నగు ద్వివిధము ;

హ్రస్వముపయి ఖండంబు పూర్ణంబు నగును ;

గాదు ఖండంబున కది దీర్ఘంబు మీద.

నారాయణశాస్త్రిగారు పీఠికాపురసంస్థాన విద్వత్కవు లగువేంకట రామకృష్ణకవుల గురువులు. శాస్త్రిగారు తెనుగుపరచిన ‘ మహిష శతకము ‘ చక్కని గ్రంథము. మహిషము మీద బెట్టి దురధికారులను దూషించు నన్యాపదేశ శతక మది. అనువాదమే యైనను గవితాధోరణి సాధుమధురముగా నున్నది.

ఉ. కొండొక దున్నపోతు నిను గూర్చి ప్రబంధశతంబు జ్యయ ను

ద్దండత నుత్సహింతు నిది త్వన్మహిమంబున జేసికాదు ; క్రూ

రుం డొక డాధికారికుడు ద్రోహమొనర్పగ గోపగించి వా

గ్దండము ద్వత్తిరస్కృతిపథంబున దుష్ప్రభులందు వైవగన్.

 

చ. అతివిభవాభిమానులు దురాగ్రహు లంతిమ జాతిసంభవుల్

వితత కఠోరభాషణులు వేరలొ యా చెడుగండ్ల మోములన్

క్షితి బరికించుకంటె బరికించుట మేలగు నీదు పృష్ఠ ; మ

క్కతమున బొట్టనిండ దొరకంగల దన్నము సైరిభేశ్వరా !

 

ఉ. సైరిభ ! నీవు తాపమునుసైచి గడింపగ ధాన్యముల్ సుబే

దారుడు కొంతసొమ్మువలె దత్సకలంబు హరించెడున్ బలా

త్కారము జేసి, దాని కొకకారణ మున్నది విన్ము పిత్ర్యమున్

దారకులే హరింతురు గదా విభు జెల్మినొ కల్మినొ లేక బల్మినో.

ఈతీరుగల శయ్యలో దూతాంగదము, భర్తృహరినిర్వేదము శాస్త్రిగారు తెనుగున ననువదించిరి. ఇవియెల్ల నొకయెత్తు ; నారాయణ శాస్త్రిగారి నారాయణీయాంధ్ర వ్యాకరణ మొకయెత్తును. తెలుగు లాక్షణికులలో శాస్త్రిగారి కీర్తి నిలబడుట కీ కూర్పు చాలును.

ఆంధ్ర రచయితలు నుండి-

———–

You may also like...