పేరు (ఆంగ్లం) | Janamanchi Seshadri Sharma |
పేరు (తెలుగు) | జనమంచి శేషాద్రి శర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | కామాక్షమ్మ |
తండ్రి పేరు | సుబ్రహ్మణ్యావధాని |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/4/1882 |
మరణం | 7/1/1950 |
పుట్టిన ఊరు | బద్వేలు తాలూకా వెంకటరాయపురం అగ్రహారం |
విద్యార్హతలు | వీరు చాలా శాస్త్రాలను పఠించారు. |
వృత్తి | కడప లో 1901 నుండి దీర్ఘకాలం ప్రధానాంధ్ర పండితునిగా పనిచేసి 1937లో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు. |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీమదాంధ్ర లలితోపాఖ్యానము, హనుమద్విజయము, సర్వమంగళా పరిణయం, ధర్మసార రామాయణం, కలివిలాసం, సత్ప్రవర్తనము, శ్రీ రామావతార తత్త్వము శ్రీ కృష్ణావతార తత్త్వము, శ్రీకృష్ణ రాయబార చరిత్రము, శ్రీ శంకరాచార్య చరిత్రము తండ్లత, వనజాక్షి, హృదయానందం, దుష్ ప్రభుత్వము, నవరత్ర హారము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | బాలసరస్వతి, అభనవ ఆంధ్ర వాల్మీకి, ఆంధ్ర వ్యాస, కావ్యస్మృతితీర్థ, కళాప్రపూర్ణ, మహాకవి, సంస్కృతసూరి |
ఇతర వివరాలు | పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి అవధానాలు చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్ధిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జనమంచి శేషాద్రి శర్మ |
సంగ్రహ నమూనా రచన | అధునాతనాంధ్రకవులలో బురాణవాజ్మయమువంక జూచినవారు నలుగు రైదుగురు మాత్రము. వారిలో భారతరామాయణముల నాదరించినవారి సంఖ్య పెద్దది. సంస్కృతములో అష్టాదశ పురాణములు కలవు గదా ! వానిని జూచుచున్న వారు తక్కువ నే డనువాదవాజ్మయమునకు, విశేషించి పౌరాణగాధలకు మనవా రంతగా జెవు లొగ్గక పోవుటచే గాబోలు భారత రామాయణాదులైన నాలుగైదు పురాణములకంటె దెలుగుబాసలో బురాణములు లేవు. |
జనమంచి శేషాద్రి శర్మ
అధునాతనాంధ్రకవులలో బురాణవాజ్మయమువంక జూచినవారు నలుగు రైదుగురు మాత్రము. వారిలో భారతరామాయణముల నాదరించినవారి సంఖ్య పెద్దది. సంస్కృతములో అష్టాదశ పురాణములు కలవు గదా ! వానిని జూచుచున్న వారు తక్కువ నే డనువాదవాజ్మయమునకు, విశేషించి పౌరాణగాధలకు మనవా రంతగా జెవు లొగ్గక పోవుటచే గాబోలు భారత రామాయణాదులైన నాలుగైదు పురాణములకంటె దెలుగుబాసలో బురాణములు లేవు.
ఈకొఱత కొంతవఱకు దీర్చిన కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రిశర్మగారు యావదాంధ్రమునకు నభివందనీయులు. వీరు ప్రస్తుతము కడపలోని ‘లలితావిలాసము’ న పుణ్యజీవనము గడుపుచున్నారు. వీరి యుభయ భాషాపాండిత్య మప్రతిమానము, పౌరాణికతత్త్వపరిజ్ఞాన మసమానము. ఉపనిషత్తులు చదివిరి. సూత్రభాష్యము నెఱిగిరి.
శేషాద్రిశర్మగారి యభినివేశ మాశ్చర్యకర మైనది. వీరు వ్రాసిన పద్యములు మొత్తము లక్షకు మించునేమో! “పాండిత్యమున నున్నవన కవిత్వమున లే” దని కొందఱివాదము. వస్తుస్థితి నిర్ణయించుట తరముకాదు. ఈ విమర్శ కాగినవారు పురాణకవులలో నెందఱుందురు ?
వీరు శ్రీమద్రామాయణమును దెనిగించిరి. అది స్వేచ్ఛానువాదము గాదు. విద్యార్థులకు సైతము సులభముగా దెలియుటకు శ్లోకమున కొక పద్యము చొప్పున వ్రాసిరి. విసుపు విరామము లేక యిన్ని పద్యములు వ్రాయుట కవి కుండవలసిన గొప్పశక్తులలో నొకటి. శర్మగారు మూర్తీభవించిన దైవభక్తి. వీరి గ్రంథము లన్నియు భగవత్పరములే. బ్రహ్మపురాణ మాంధ్రీకరించిరి. బ్రహ్మాండపురాణ మనువదించిరి. స్కాందమున కేతామెత్తి కౌమారికాఖండము కేదారారుణాచలఖండములు పరివర్తన మొనరించిరి. తాండవకృష్ణభాగవతము-సర్వమంగళా పరిణయము-హనుమద్విజయము- కృష్ణావతారతత్త్వము (12 భాగములు)-రామావతారతత్త్వము (10 భాగములు)-సంగ్రహ భారత భాగవత రామాయణములు ఈగ్రంధములన్నియు భగవత్సంబంధములే గదా? చరిత్రవిషయముగూడ నెఱుగుదు నని కడపమండలచరిత్ర – ఉదయగిరి ముట్టడి రచించి చూపిరి. శర్మగారికి మనుచరిత్ర మనిన నెక్కువ మక్కువ. పెద్దన వీరి దృష్టిలో మహామహాంధ్రకవి. ఇతని జన్మాదికమునుగూర్చియు, నీతని కవిత్వ విశేషములనుగూర్చియు వీరు చక్కని పరిశోధనముల జేసియున్నారు. అవి సమంజసముగా నుండును. పెద్దన బళ్ళారి మండలమున గల దూపాటుసీమనుండు ‘దోరాల’ గ్రామమున బుట్టెనని వీరేశలింగము పంతులు గారు వ్రాసిరి. ఈవిషయమున ననేక సార్లు పరిశోధనల జేసి సప్రమాణముగా నాయన వాదమును గాదని వాదించిరి. ఇది వీరి చరిత్ర పరిజ్ఞానము వెల్లడించుటకు బనికి వచ్చును. వీరు ప్రత్యేకముగా ‘మనుచరిత్ర హృదయావిష్కరణము’ రచించిరి.
చిన్ననాట శేషాద్రిశర్మగారు కడపలో విద్యాభ్యాసము కొన్నాళ్లు చేసిరి. అక్కడ సరిగ జదువు సాగమి కాశీపట్టనమునకు బదునొకండవయేట బయనము సాగించి , కాలినడకచే నాలుగేండ్లకు వారణాసి జేరికొనిరట. అచ్చట గొన్ని వత్సరము లుండి సంస్కృతవిద్యాధ్యయనముగావించి వచ్చి, విజయనగరము, కసిమికోటలలో బండితసన్నిధిని స్కంధత్రయాత్మకజ్యోతిర్విద్య నభ్యసించిరి. జ్యోతిశ్శాస్త్రమున శర్మగారు చాల బ్రజ్ఞావంతులు.
జ్యోతిషము చెప్పుచు నందఱ నాశ్రయించి తిరుగుట వీరి కిష్టముగాక కడపలోని యాంగ్ల పాఠశాలలో నాంధ్రపండితులుగా బ్రవేశించిరి.
నెల్లూరి కడనున్న జన్నవాడ క్షేత్రమున బినాకినీ తీరమున కామాక్షి మల్లికార్జునుల సన్నిధిని వీరు నడుమనడుమ బెక్కు నెలలు వసించి తపము గావించు చుందురని వినికి. ఆయుపాసనామహిమచేతనే వీరు మహోత్సాహముతో గంటకు వందలు పద్యములు వ్రాయుచున్నా రని చెప్పుదురు. ఒకమహాశయు లిట్లు వ్రాసిరి.
ఆ. వె. ఉన్నకవులలోన జన్నకవులలోన
నిన్నికృతులు వ్రాయ గన్న దెవరు ?
రాము డల్లపోతరాజునకుంబోలె
బలుకుదోడొ యేమొ ? లలిత నీకు.
వీరు నరాంకిత మొనరింపలేదు. జనమంచిశర్మగారు విద్వత్కవులే గాక సత్తములు, సహృదయులు, పరమభాగవతోత్తములు. దుర్విమర్శనములు దురహంకారములు వీరికినచ్చవు. ఒకపు డెక్కడో యొకసభలో మన శర్మగారిని వ్యక్తిపరముగా దూషింప మొదలిడిరట. ఆ సభలో శర్మగారును గలరు. కాని వారు నవ్వుకొనుచు నూరకుండిరట. అయినను సభావేదికకు బ్రక్కవారి ప్రోత్సాహముచే నెక్కక తప్పినది కాదు. లేచి చెప్పినమాట లివి: “మహాజనులారా! ఈసమయమున వాదప్రతివాదములు జరుపుట నా కిష్టములేదు. ఏనాడో ఎన్నితరముల క్రితమో జనులయెడ మంచిగా మెలంగుచుండుటచే మాకు “జనమంచి” యను నింటిపేరు వచ్చినది. ఇప్పుడు నేనును మొగము చెండుకొని వారివలె ననవసరముగా నా ప్రతిపక్షుల విమర్శించితి నేని మాయింటిపేరు నేతిబీఱకాయను జేసినవాడ నగుదును.” ఈ వాక్యములలో శర్మగారి సహృదయత వ్యక్త మగుచున్నదిగదా? మహాకవులకు మంచితనము తోడైనచో వచింపనేల ? శేషాద్రిశర్మగారు దత్తమండలమునకే గాక తెలుగు బుడమికి వన్నె దెచ్చు కవులు. నాస్తికతా ప్రాబల్యముతో నిండియున్న నేటికాలమునకు శర్మగారివంటి భాగవత కవులు, వారి గ్రంథములవంటి భక్తి రసపూరిత గ్రంథములు మిన్నగా జనింపవలసి యున్నది. శర్మగారి గ్రంథము లెల్ల వెలువరింప దీక్షించిన శ్రీ వావిళ్ళ వంకటేశ్వరశాస్త్రిగారి నభినందింపవలయును.
కళాప్రపూర్ణులు, కావ్యస్మృతి తీర్థులు నగు శేషాద్రిశర్మగారిని గూర్చి కట్టమంచి రామలింగారెడ్డిగారి ప్రశంస యుదహరింపదగినది. “వీరి కవిత్వమునకు వీరి వినయాతిశయము శోభను గలిగించుచున్నది. కవిత్వపాండిత్యములకును, సౌజన్యమునకును నిత్యసంధి లేదనుట మనమెఱిగిన విషయమే. వీ రెవ్వరినిగాని యధిక్షేపించినట్లు, ఎవ్వరితోగాని వాదమునకు బూనుకొన్నట్లు గానరాదు. సౌజన్యము వీరి కలంకారము. ప్రఖ్యాతికై ప్రాకులాడువారు కారు……”
శర్మగారి కవిత్వము ధారాళధోరణి గలది. వీరి గ్రంథము లన్నియు ననువాదములే యగుటచే గల్పనాగంభీరిమ వీరెంతగా బ్రదర్శింతు తెలిసికొన జాలము. శౌమారికాఖండము నందలి గౌరీశంకర వివాహ ఘట్టమున వీరికవితాధార జాహ్నవి వలె నిట్లు పొంగారుచున్నది.
క. కనిపెట్టుచు బ్రాహ్మణవరు
లనూన పద్ధతిని సాగునట్లొసరుపగా
దనయాన్వయముల జెప్పం
గను బూని హిమాద్రి యనియె గన్యక దీనిన్.
క. పితరులు దౌహిత్రిగ నా
సుతగా నెఱుగంగ దగును శుభగుణ నిలయన్
మతిమద్వర్య నొసంగెద
హితమిది లోకాళి కన్న యిచ్ఛ పొలయుటన్.
క. అనియూరకుండె; నల్లుని
దనబడు వంశం బెఱుంగ డయ్యెంగానన్
మునిముఖుల నడిగె వంశం
బన నెయ్యది శంభుని దని యంద ఱెఱుగమిన్.
మ. వనజాక్షుం డిటు పల్కె; నెవ్వరిని నీ వార్తన్ వచింపంగ నే
రని వారిం గని ప్రశ్న మీవడిగినన్ రా దు త్తరం బెవ్వరై
నను గుర్తింపగరాని యన్వయము వింతగాంచు నీయల్లునే
యనుమోదంబున బ్రశ్నచేయు; మతడే యావార్తలం జెప్పెడున్.
క. వినుమహియే యహిపాదము
ల నెఱుంగుంగాని యెవ డిలాస్థలి జెప్పం
గను జాలునె తెలియుదు: నని
తన గోత్రము జెప్పడేని తగ మద్భగినిన్.
క. ఒసగంగ రాదు: శంభున
కసమాన్వయు డగుట: ననగ నమ్మాటకు సం దెసగెను హాసధ్వను; లా
సుసమయ మావేడుకలకు జోటయి యుండన్.
చ. హరుడిపుడేమి యుత్తరము నారసి యిచ్చునొ వీనులార ని
త్తరుణమునందు వింద: మని తత్తఱమందుచు సభ్యులెల్ల నుం
డిరి: ధ్వని యద్ది తగ్గె నట నీలగళుండు విమర్శపద్ధతిన్
వరమతి నెన్ని భీతుడగువానివిధంబున నాసతాన్యుడై.
గ్రంథవిస్తారరచనలో నచటనచట గొన్ని వ్యర్థపదములు దొరలినను, శర్మగారి ధారావాహికమైన శయ్యలో నవి పరిగణింప దగినవికావు. కవిత్వమే తపస్సుగా భావించి, యోపికతో మనస్సు నిలబెట్టి యెన్నో మహాకృతులు రచించి యిచ్చుచున్న శేషాద్రిశర్మగారి సేవ రాయలసీమలో తెలుగుసీమలో విలువయిడ రాని యొక మేలి రవ్వ.
ఆంధ్ర రచయితలు నుండి-
———–