పేరు (ఆంగ్లం) | Vedula Ramakrishnasastry |
పేరు (తెలుగు) | వేదుల రామకృష్ణశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | సూరమ్మ |
తండ్రి పేరు | రామచంద్రశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1889 |
మరణం | 1/1/1918 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం,కాకరపర్రు గ్రామం |
విద్యార్హతలు | చర్ల నారాయణశాస్త్రి వద్ద సాహిత్యము, రామడుగుల వీరేశ్వరశాస్త్రి వద్ద శబ్దశాస్త్రము, విశ్వపతిశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము నేర్చుకున్నారు. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ప్రాకృత |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నరకాసురవ్యాయోగము (ఆంధ్రానువాదం), కుకవినిందనము (ప్రాకృత భాషలో), కర్ణవిజయ వ్యాయోగము (సంస్కృతభాషలో) ఓలేటి వేంకటరామశాస్త్రి తో కలిసి జంటగా రచించినవి: వ్యాసాభ్యుదయము, దమయంతీ కల్యాణము (అచ్చతెలుగు కావ్యము), ఉత్తరరామచరిత్ర, మదాలస (నాటకము), భోజచరిత్ర, కాత్యాయన చరిత్ర సువృత్త తిలకము (అనువాదం), పాణిగృహీతి, కొండవీటి దండయాత్ర అత్యద్భుత శతావధానము, పరాస్తపాశుపతము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వేదుల రామకృష్ణశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | ఆంధ్రభోజుని యాస్థాన విద్వత్కవులగు వేంకట రామకృష్ణ కవుల కవితాప్రతిభ, విమర్శనశక్తి తెలుగువారికి దెలిసియే యుండును. 1909 సంవత్సరమున రామకృష్ణులు పిఠాపురసంస్థానమున బ్రవేశించిరి. నాటికి వేంకటరామశాస్త్రిగారి వయస్సు ఇరువదియాఱు వత్సరములకు మించదు. రామకృష్ణశాస్త్రిగారికి బదునెనిమిది దేండ్లు దాటినవి |
వేదుల రామకృష్ణశాస్త్రి
ఆంధ్రభోజుని యాస్థాన విద్వత్కవులగు వేంకట రామకృష్ణ కవుల కవితాప్రతిభ, విమర్శనశక్తి తెలుగువారికి దెలిసియే యుండును. 1909 సంవత్సరమున రామకృష్ణులు పిఠాపురసంస్థానమున బ్రవేశించిరి. నాటికి వేంకటరామశాస్త్రిగారి వయస్సు ఇరువదియాఱు వత్సరములకు మించదు. రామకృష్ణశాస్త్రిగారికి బదునెనిమిది దేండ్లు దాటినవి. సంస్థాన ప్రభువులు శ్రీ రావు వేంకట కుమార మహిపతి సూర్యరాయేంద్రు వీ కవకవుల బుద్ధి చాకచక్యమునకు గవితాధోరణికి నానందపడి యవధానవిశేషముల గాంచుట కనుమతించిరి. ఏ సుముహూర్తమున నీ జంటకవులు ప్రభువుకంట బడిరో యపుడే శ్రీవారి యనుగ్రహాంకూరము రామకృష్ణుల యభ్యుదయ క్షేత్రమున బడినది. దిగ్దంతులవంటి పండితులమ్రోల నా మహాస్థానమంటపమున నత్యద్భుతావధానము సేయునపుడు రామకృష్ణుల లీలలు పలువుర కానందాశ్చర్యములు కలిగించినవి. మహీనాథు డవధానానంతరము మూడు నూటపదియార్లు పట్టుసాలువలతో బహూకరించి యా కవులను దమ సంస్థానిలో నుండగోరెను.
పిమ్మట నత్యద్భుత శతావధానము, శతవిధానము [గంటకు నూఱుపద్యములు చెప్పుట] శతప్రాసము [ఒకేప్రాసముమీద నూఱు పాదములు గంటలో జెప్పుట] అష్టావధానము మున్నగువానిచే మన కవులు మహారాజు చిత్తమును మఱింత రంజింపజేసిరి. శతప్రాసము చెప్పుసందర్భమున “…ఇట్లిరవుగ గొన్నిపాదములనే మును గబ్బము తాత సెప్ప న, బ్బురపడి తత్సభాస్థలిని బోరన గద్దియ డిగ్గి గండ పెం, డెరమును గృష్ణరాయుడు తొడ్గె న్నృపపుంగువ!…” అని యభిప్రాయగర్భముగా నెట్లుచెప్పిరో పరికింపుడు.
వేంకటరామకృష్ణులు పిఠాపురసంస్థానమునకు బోవుచున్నటు లింటియొద్ద బెద్దవారి కేరికిని జెప్పనేలేదు. పట్టుసాలువలు కప్పుకొని సింగపు బిల్లలవలె వచ్చుచున్న యా యువకవుల గని తలిదండ్రు లానందభరితులైరి. గ్రామస్థు లాశ్చర్యకలితులైరి. ఈ జంటలో దొంటికవి ఓలేటి వేంకటరామశాస్త్రి, ద్వితీయుడు వేదుల రామకృష్ణశాస్త్రి. వీరు మేనత్త మేనమామ బిడ్డలు. వీరిని స్మరించునపుడు నంది మల్లయ్య, ఘంట సింగన జ్ఞప్తికి వత్తురు.
“కౌరవగౌరవ” మనుపేర బాండవులది యన్యాయమనియు, కౌరవులది న్యాయమనియు సమర్థించుచు జక్కని పద్యములు ‘ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక’ లో నావిష్కరించిరి. అందలి విషయ మెట్లున్నను గవితా ధోరణి భారతమును బోలియున్నదని జయంతి రామయ్యపంతులు గారు మఱిమఱి ప్రస్తుతించిరి. ఇట్లే రామకృష్ణకవులు విలక్షణ భావనా పథవిహారులై యుండెడివారు. వీరి ‘పాణిగృహీతి’ యను ఖండకావ్యము తెలుగు వాజ్మయమున కొక గళాభరణము. ప్రతిపద్యము నొక మహానర్ఘమణి. కొన్నిమణులు ముందు పెట్టెదను.
వధువు-పెండ్లికూతురు
ఏ గచ్చేరికి నేగ గావలయు నోసీ! పిల్లనిం బుచ్చుకో
“వేగన్ ర” మ్మని బొమ్మ యొండిడు వరున్ విప్రోపదిష్టార్థయై
“యే గీతంబుల నేర్చికోవలయు నేడీ మీజవా? నెత్తుకో
నీ గాగూడదె?” యంచు బల్కువధు వెందిష్టాప్తి రంజిల్లుతన్.
సువాసిని-ఆడుపడుచు
ఒకసాయ మ్మసివారి కేగిన మగండొక్కింత కేతెంచి పి
ల్వకయే తల్పును దట్టగా దయిత “యెవ్వార్వా” రనన్ లజ్జ మి
న్నక యుండన్ బతి; “పల్కవే” మని కృతన్యక్కారయై తల్పు దీ
సి కడున్ వెల్వెలబాఱి పర్విడు మృగాక్షిన్ భర్త మన్నించుతన్.
మధ్యమ-కొమరాలు
అనువాదమ్ములతో బురోహితుడు గర్భాధానఖండం బఠిం
చినమీదం గులపాలికల్ తమకు బాసెం బేక పాత్రంబులో
దిన బెట్టన్ బతి గిన్నెలోన దన చేతిం దాకు సారస్యమున్
గని యాపై జెయినే కదా యిడని ముగ్ధన్ నేత మోహించుతన్
స్నుష-కోడలు
కియతిన్ వర్ణనసేయరానియవియౌ కేళీవిలాసమ్ము ల
క్షయమై యుండనె మూడునిద్దురలు కాగా సారెయుం జీరయున్
గయికొం టెట్టులొ పుట్టినిల్లు విడి సాక్షాల్లక్ష్మిఆ గ్నానగా
నయి యత్తింటికి వచ్చు క్రొత్తడికి జిత్తాహ్లాద మేపారుతన్!
గుర్విణి-చూలాలు
నెలదప్పన్ బొరుగిండ్ల యాండ్రు “కడుపా నీదైన గారాబు కో
డలికిన్? జెప్పపు, చిన్న నాటనె యదృష్టం” బన్న చోనత్త “యౌన్
దల లేర్పాటయి లోకులంబడిన గాదా?” యన్న దన్నానుడిం
గల తీరడ్గెడు గోల నేల నడువంగా నిచ్చునే యెట్టిడున్.
కుటుంబిని-ఇల్లాలు
“ఏలా నీకు భయంబుజెంద ? దలపై నెక్కించుకొందు న్నినున్
బాలా! యత్తయు నాడుబిడ్డలును నీపంతంబు చెల్లింత్రు నా
శ్రీలన్నింటికి నీవెరాణి” వని పేర్మింబల్కి పెండ్లాడి య
య్యాలిం గూలిపడంతికై వడిగనం బ్రాణంబు లెట్లొప్పెడిన్.
ఇది యటుండ, చెన్నపురమున నొక విద్వత్సమాజ మేర్పడి కృష్ణదేవరాయల కొండవీటి దండయాత్రను గూర్చి యొకకావ్యము రసోత్తర ముగా రచించువారిలో నుత్తమ శ్రేణికి జెందిన కవికి బంగారుపతకము బహూకరింతు మని ప్రకటించిరి. ఆ పందెములో మన కవుల రచనమే నెగ్గినది. అపు డిటులు చెప్పుకొన్నారు.
మద్రనగరాంధ్ర విద్వత్సమాజ దత్త
నూత్నవిషయ క్రియాలబ్ధ రత్నఖచిత
హేమబిరుదాభిరాములు, రామకృష్ణ
రచయితలు పీఠపుర యువరాజ గురులు.
ఇట్లీ మేనత్త-మేనమామబిడ్డలు క్రొత్తపోకడలతో గవితాభారతి నారాధించుచుండ 1918 లో ద్వితీయుడగు రామకృష్ణకవి యకాలమృతికి బాలుపడియెను. ఇత డాచార్య శంకరులవలె నత్యంత తరుణ వయస్సుననే మరణించి యేకైక పుత్రకులు సజీవులునైన తలిదండ్రుల దు:ఖాబ్ధి ముంచినాడు. చనిపోవునప్పటికీ కవికి 29 ఏడుల యీడు. ఈ సందర్భమున నీతరుణకవి విశిష్టత బేర్కొనుట యప్రస్తుత ప్రశంస కాదు. ఇతడు తన పదునొకండవ యేట ‘నరకాసురవ్యాయోగము’ నాంధ్రీకరించినాడు. పదునాల్గవయేట ‘దమయంతీకల్యాణము’ అను నచ్చ తెనుగు ప్రబంధము సంతరించినాడు. అసాధారణమైన మేధాసంపద గలవాడు. మూడు భాషలలోని మూడు పద్యములు కలిపివైచి ‘వ్యస్తాక్షరి’ యీయగా హేలగ జెప్పిన బుద్ధిశాలి. కాకరపఱ్ఱున జిన్ననాట నితడు వీథివెంబడి బోవుచుండు నపుడు అరగులపై బాఠములు చెప్పుచుండు పండితులు జంకు చుండెడి వారట. ఇతని కబ్బినది ప్రాక్తన జన్మవిద్యగాని యభ్యస్తముగాదని యిచ్చటివారు ముచ్చటగా జెప్పుచుందురు. ప్రాకృతమున ‘గుకవినిందనము’ – సంస్కృతమున “కర్ణవిజయ వ్యాయోగము” వ్రాసినాడు. ఇవి యముద్రితములు. ఇంత చిన్న తనముననే బహుగ్రంథములు సంధానించి, సంస్థాన విద్వత్కవియై పేరు మోసిన కృష్ణుడు కవిలోక జిష్ణుడు. “కృష్ణకవి నోట బంగారు గిలక దీట.” సహకవి యెడబాటు పిమ్మట, జంటలో దొంటివారగు వేంకట రామశాస్త్రిగారు-
అనగు మేనత్త కొమరుడై యాశుకవిత
నాకు జేదోడు వాదోడునై కడచిన
కృతి సమర్థుండు మారామ కృష్ణ శాస్త్రి
యున్న నీ సాయ మర్థింతునోటు దేవి!
చనియె గదమ్మ నీ యపరజన్మవిలాసము మాకుజూప వ
చ్చినగతి వచ్చి సత్కవితచే గవికోటికి వన్నె దెచ్చి యం
తనె యతడట్లు నీతనువునన్విలసిల్లిన నెవ్వ రింక నా
పొనరుచు నీకృతి క్రియకు బూనిక దోడ్పడువారు భారతీ!
అని దు:ఖించు సోమ దేవ భట్టారక విరచితము, అష్టాదశలంబకాత్మకము నగు ‘కథాసరిత్సాగరము’నాంధ్రీకరింప దొడగిరి. అందాఱు లంబకము లయినవి. ఆంధ్ర కథాసరిత్సాగరము లోని కవితా శైలి నన్నయ కవిత్వపు దెన్నునకు దీటు వచ్చునట్లున్నదని తెలుగు దేశములోని పండిత కవులెందఱో కొండాడియున్నారు. ఆ కృతిపీఠికలో నాధునిక కవిత్వమునుగూర్చి వేంకట రామశాస్త్రిగారి యభిప్రాయ మిట్లు తేలినది. బంధము లెల్లవీడి బహుభావ సమృద్ధిగ నేడు మత్తపు
ష్పంధయగీతి నా విరియబాఱుచు నున్నది తెన్గుగైత; మ
ద్గ్రంథము గాంచుకాల మిదికా దటులైనను నేను బూర్వ ని
ర్బంధ కవిత్వపద్ధతుల బట్టియె దీని రచింప బూనితిన్.
ఈగ్రంథము నొకరురచించినను ‘వేంకటరామకృష్ణ ప్రణీత’ మనియే ప్రకటిత మగుట వారి యభేద భావమునకు జక్కని గుఱుతు. ఈ కృతి పీఠికాపుర యువరాజవరులు, ప్రియఛాత్రులు నగు రావు వేంకట గంగాధరరామరాయ కవిరాజుల కంకితము అందలి సుప్రసన్న శయ్యతియ్యదన మిట్లున్నది:
శా. ‘కానీచూత’ మటంచు నీవడుగ వీకన్ జేతిలో బోసితిన్
దీనారమ్ములు పెక్కు; వానికగు వృద్ధిందే; వదట్లుండె; నా
దీనారమ్ముల నేని నాకిడవు; సందేహింప కీరీతిగా
నౌనా! వెండియు వచ్చితే యడుగ మూర్ఖా! సిగ్గులేదయ్యెనే?
క. ఓ చెడుగా! యచ్చో గల
యాచచ్చిన మూషకమ్ము నైన బణముగా
జూచుకొని కుశలు డగువా
డేచందంబుననొ ధనము నిట్టెగడించున్.
గీ. అట్టియెడ నీవు చేతిలో బెట్టినట్టి
సొమ్ము గడ తేర్చి వెండియు దెమ్మనంగ
వచ్చినాడవు; పోపొమ్ము చచ్చినాడ!
దాచ బెట్టితె యిచట నీతాత మూట?
క. అని కనరు మండ నే నది
విని యామృత మూషకమ్ము వేడెద నా కి మ్మనఘా! యిదియ పణమ్ముగ
గొని నేవర్తకము జేసికొందు నటంచున్.
క. చచ్చిన యాయెలుకను నా
కిచ్చినయటు పద్దు వ్రాసి యిడి యతనికి, నే
దెచ్చితి దానిం గని యత
డచ్చెరుపడి నవ్వు కొనుచు నభినందింపన్.
ఈ తీరుగా మెత్తని నిర్దుష్ట శయ్యలో నీకృతి యున్నది. వారి చేతి మీదుగానే కృతి తుదముట్ట కుండుట దుర్విధి. ‘నూటఏబదియార్లు’ అనుపేర బరమేశ్వరుని గూర్చి వీరు సీసములు రచించిరి. అవి సువర్ణములు. ఈ కబ్బము తెనుగువారి డెందము లుబ్బింపగల గీతాంజలి. ప్రతిభాజన్య మయిన దీనికి దగినంత ప్రశస్తి దేశమున లేదు.
హృదయ పాత్రంబులో నేమియున్నదొ కాని
తొలకుచున్నది నిన్ను దలచినపుడు
ఈ మన:ఫలకమం దేమి యున్నదొ కాని
మ్రోగుచున్నది నిన్ను మ్రొక్కినపుడు
శీర్ష పేటిక నేమి చిత్రమున్నదొ కాని
మూయుచున్నది నిన్ను ముట్టినపుడు
ఈ భావవీథిలో నేమియున్నదొ కాని
తారుచున్నది నిన్ను గోరినపుడు
రమ్ము! నాతండ్రి! నను జేరరమ్ము! ప్రణతి
గొమ్ము! కరుణించి నన్నేలుకొమ్ము! చేర
నిమ్ము! నీదర్శనంబు నాకిమ్ము! నిన్నె
నమ్మినాడను శాశ్వతానందనిలయ!
ఆంధ్ర రచయితలు నుండి-
———–