అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి (Avvari Subrahmanya Sastry))

Share
పేరు (ఆంగ్లం)Avvari Subrahmanya Sastry)
పేరు (తెలుగు)అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుకన్న తల్లి :మహాలక్ష్మమ్మ, దత్తత తీకుకున్న తల్లి: లక్ష్మీదేవమ్మ
తండ్రి పేరుకన్న తండ్రి: రామయ్య, దత్తత తీసుకున్న తండ్రి: వెంకటప్పయ్య
జీవిత భాగస్వామి పేరులక్ష్మీనరసమ్మ
పుట్టినతేదీ1/1/1883
మరణం8/15/1935
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా, కాకుమాను మండలం, గార్లపాడు గ్రామం.
విద్యార్హతలుగురుముఖముగా అభ్యసించిన దానికంటే స్వయంగా చదివి సాధించిన శాస్త్రపాండిత్యమే అధికము.
వృత్తిముప్పది యేళ్ల వయసులో తెనాలి అద్వైత వేదాంత శిరోమణి కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరాడు. కొవ్వూరులోని ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతెలుగు కావ్యాదర్శము, ఆంధ్రభాషావిలాపము, శిథిలాంధ్ర వైభవము, శివతత్వ సుధానిధి, దైవబలము, కావ్యనాటకాది పరిశీలనము, సీత, మాఘపురాణము,
జీవన్ముక్తి – విదేహముక్తి, సుగుణోపాసన – నిర్గుణోపాసన, యజ్ఞోపవీత తత్త్వదర్శనము
రుద్రాక్షాది మాలలు – ఫలములు, మేఘము, ఆంధ్రధ్వని మొదలైనవి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆశుకవితిలక, విద్వదాశుకవి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి
సంగ్రహ నమూనా రచనఆశుకవితలో నవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కాంధ్రమున మంచిపేరున్నది. 1910, 11 సంవత్సరముల ప్రాతమున దిరుపతి వేంకట కవులకు గొప్పరపు సోదరకవులకు నాశుకవితా విషయమున హోరాహోరి యుద్ధము తటస్థించినది. ‘గుంటూరుసీమ’ పూర్వోత్తరరంగములు తన్మూలముననే రచింపబడినవని తెలుగువారి కెల్లరకు దెలియును. కొప్పరపువారితో గవిత్వపుబోటీకి నీ సుబ్రహ్మణ్యశాస్త్రులు గారిని నాడు తిరుపతివేంకటకవులు పంపించిరి.

అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి

 

ఆశుకవితలో నవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కాంధ్రమున మంచిపేరున్నది. 1910, 11 సంవత్సరముల ప్రాతమున దిరుపతి వేంకట కవులకు గొప్పరపు సోదరకవులకు నాశుకవితా విషయమున హోరాహోరి యుద్ధము తటస్థించినది. ‘గుంటూరుసీమ’ పూర్వోత్తరరంగములు తన్మూలముననే రచింపబడినవని తెలుగువారి కెల్లరకు దెలియును. కొప్పరపువారితో గవిత్వపుబోటీకి నీ సుబ్రహ్మణ్యశాస్త్రులు గారిని నాడు తిరుపతివేంకటకవులు పంపించిరి. వేమవరాగ్రహారమున దత్ప్రర్శనము గావింపబడినది. ఓహో! శాస్త్రులుగారి కవితాజవమునకు బట్టబగ్గములులేవు. కొప్పరపుగవు లోడిపోయిరి. శాస్త్రులుగారు నెగ్గివచ్చిరి. గురువులు తిరుపతి కవులు శిష్యుని మెచ్చుకొని యిట్లు వ్రాసి యిచ్చిరి.

అన్నంబెక్కడనో భుజించితిని విద్య న్నాకడ నేర్చి; తెం
దున్నీయందు లవంబు గాననుజుమీ దోషంబు, దుశ్శాత్రవుల్
నన్నున్ మార్కొన వారియాశువుల చందంబెల్ల నవ్వారి సు
బ్బన్నా గెల్చిఋణంబు దీర్చితివి మమ్మా! శిష్యచూడామణీ!
‘వేంకటశాస్త్రి’ ప్రకటతరాశుధారను సభాపదులెల్లరు మెచ్చుచుండ, నా
యకమణి సంతసింపగ నయారె! రచించినవాడవీవు, వా
రక యరవింద సుందర మరంద ఝరంబు స్రవించుచుండు నీ
సుకవిత గాచుకో దగవె సుబ్బనశాస్త్రి! జగద్ధితంబుగన్.
‘తిరుపతిశాస్త్రి’

ఇదిగాక, సికిందరాబాదు మున్నగు ప్రసిద్ధస్థలములలో వీరుగావించిన శతాష్టావధానములు, ఆశుకవితా ప్రదర్శనములు పలువుర ప్రశంసల నందుకొన్నవి. తెలుగునను సంస్కృతమునను వీరు సమాన వేగముననే కవితచెప్పగలిగిరి. ఎట్టివాడైన సంస్కృతములో దడవు కొనకుండ మాటాడునలవాటు మనప్రాంతీయులలో గడునరుదు. శాస్త్రులుగారు నిరాఘాట ధోరణి మాటాడునపుడు పండితులు దిగ్ర్భాంతి పడువారు. ఇది యత్యుక్తి కాదు. ఏలేశ్వరపు నరసింహశాస్త్రిగారొకరు సంస్కృతాశుధోరణిలో బేరుపడ్డవారు. ‘ఆశుకవితిలక’ బిరుదాడ్యులగు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమగురువుల నిటులు పేరుకొనిరి.

శ్రీయుతులు బొడ్డుపలి సుబ్బరాయబుధుని
కొలచల నృసింహశాస్త్రిని గురువరులను
స్తుతి యొనర్చి, యద్దేపల్లి సోమనాథ
తార్కి కాగ్రణి దేశికు దలతు మదిని. ‘ఆంధ్రధ్వని’

తరువాత శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి సన్నిధికిజేరి, వేటూరి ప్రభాకరశాస్త్రి పాదుని సహాధ్యాయత్వమున ‘సిద్ధాంతకౌముది’ పాఠము చేసిరి. శ్రీ బ్రహ్మానంద తీర్థస్వాములతో బ్రస్థానత్రయమధ్యయనము గావించిరి. తర్క వ్యాకరణములు, వేదాంతము, ధర్మశాస్త్రము, అలంకారము మున్నగు వివిధశాఖలలో వీరి కనల్పమగు పరిజ్ఞాన మున్నదనియు, నాంధ్రములో వీరిపాండితి యుద్దండ మైనదనియు బండితు లెన్నుకొందురు. ఈయన ప్రాచీనవాజ్మయమును దఱచిన లక్షణ వేత్తయైనను, నూతనత్వమెఱుగని ఛాందనుడు కాడు. ప్రస్థానములు పఠించిన వేదాంతి యైనను, రసతత్వము తెలియని శ్రోత్రియమాత్రుడు కాడు. మంచి లౌకిక విజ్ఞానము కలవాడు. గొప్ప దేశాభిమానము కలవాడు. పతితాంధ్ర సామ్రాజ్య విభవమును గూర్చి వగచు జాతీయ కవిశిరోమణి. ‘ఎండ్లూరు’ పూర్వసంపదను స్మరించుకొని రచించిన యీ సీసములు సువర్ణములు.

నీమట్టిలో బుట్టి నిఖిల దేశంబుల
వెలిగించియుండెగా తెలుగు వెలుగు
నీనీట తేటయై నానాస్థలంబుల
నాక్రమించెనుగదా యాంధ్రకీర్తి
నీలోని గాలిలో లీలయై పలుచోట్ల
జెంగలించెనుగా, త్రిలింగదీప్తి
నీపైరుపంటల నిగ్గయి యెల్లచో
దనరారియుండెగా, తెలుగుశక్తి

యే జెముడుపొదలన్ లోన నిమిడి దాగి
యుండెనో యిప్పు డల్ల నీయుచ్ఛ్రయంబు
రామచంద్ర రాజేంద్రుని రామభద్రు
భూరమణు గన్నతల్లి! యెండ్లూరుపల్లి!
పుడమి వేల్పులకు నీపుత్త్రులొసంగిన
రమ్యమహాగ్రహారముల పేర్లు
జంగము కథలలో శృంగార పూరమై
పాఱుచునుండెడి వీరరసము
తాతలనాటి కథల్ చెప్పుకొనుచుండు
కులవృద్ధుల బెడంగు గలుగు నుడులు
క్షాత్త్రప్రియుల్ మది స్మరియించుకొని శిర
శ్చలనంబుతో జేయు శ్లాఘనములు నీదు చల్లని కాన్పున నెగడినట్టి
పౌరుషాదార్యరేఖల బ్రస్తుతించి
పోవునో యేమొ, నీపేరు పుడమి విడిచి
శూరగర్భ వొకప్పు డెండ్లూరుతల్లి!

బళీ! ఏండ్లూరు పూర్వము శూరగర్భయట. నేడు జెముడుపొదలతో నిండియున్నదట. ఈ దుస్థితి కవి నెంత పరితపింప జేసినదో ? ఆర్ద్రహృదయుడగు నీకవి హృదయ ప్రణీలికనుండి యుబికిన యీ సహజ కవితాప్రవాహము రసవిదులకు దలమున్కలు చేయుచున్నది. ఇట్టి పద్యములు నాలుగే వ్రాయుగాక, అవినాలుగు కావ్యములుకావా ? శ్రీశాస్త్రిగారు ‘భారతి’ లో వెలువరించిన యీసందేశము చదువుడు.

“……నవీనరహస్యములను గల్పనాప్రపంచముద్వారా వాజ్మయ ప్రణాళికలో బ్రవహింపజేయు నుకవుల సందేశము లుగ్గుబాలుగ నేజాతికి జీర్ణమగుచుండునో, వారిదే యభ్యుదయము, వారిదే స్వాతంత్ర్యము, వారిదే విజయము……” భారతిప్రభృతి పత్త్రికలలో నప్పుడప్పుడు ప్రకటించిన ఖండకావ్యములుగాక, వీరి పద్యకృతులు ప్రత్యేకముగ నచ్చుపడినవి కానరావు ‘దైవబలము’ అనుపేరుగల భక్తి ప్రధానమగు చిన్న కావ్యమొకటి ప్రకటితము. “మేఘుడు” అనుఖండ కావ్యము నవీనమార్గములో జివరికాలమున వీరు రచించినది ప్రచురింప బడలేదుగాని, శాస్త్రిగారిశిష్యపరంపర నోళ్ళలోనానుచున్న కొన్నిపద్యములు విన్నచో నది రసపరిప్లుతమగు కావ్యమని తోచును. వీరి యాంధ్రధ్వని, తెలుగుకావ్యాదర్శము, కావ్యనాటకాది పరిశీలనము మొదలుగాగల రచనములను జూచిన నలంకార శాస్త్రమున నీయన యెట్టి పరిశ్రమ గావించెనన్న దానికి బ్రత్యుత్తరమిచ్చును. రసగంగాధర మాంధ్రీకరించిరని కూడ దెలియవచ్చినది. రామాయణకథను దీసికొని సంస్కృతమున నాటకములుగా నిబంధించిరనియు జెప్పుకొందురు. మఱి, అవి యన్నియు నెవ్వరికడనున్నవో ? ఏమైనవో ? – వేదాంతమున ననంతపరిశ్రమముగావించి గ్రంథములు, ననేకవ్యాసములు వీరు ప్రచురించిరి. శాస్త్రిగారు గద్వాల, ఆత్మకూరు, ముక్త్యాల మున్నగు వివిధసంస్థానములలో బ్రతివాదిభయంకరముగా గవితాప్రదర్శనము గావించుచు, బిరుదములు తాల్చుచు గీర్తికాములై ప్రవృత్తిపథమున సంచరించిన వారుగా స్థూలదృష్టికి దోచినను, సామాన్యులకు గోచరింపని నివృత్తిమార్గముననే వీరిచిత్తము సంచరించుచుండెడిదిదని యిక్కడ జెప్పదగిన రహస్యము. ఆయన సహజసాత్త్వికరూపము, శాంతగంభీరభాషణము, నిత్యభాష్యపర్యాలోచనము, కర్మాచరణము స్మరణీయము లైనవి. ఇట్టి గర్వరహితుడు, నిష్ఠాసహితుడు పండితులలో నూటికి గోటికి నుండుననుటకు సంశయపడను. వైశ్వదేవము చేయక వీరెన్నడు నన్నముతినలేదు. ఈయన యెప్పుడును ‘తమపేరే’ మనియడుగ ‘సుబ్బయ్య’ యనియే చెప్పెనుగాని సుబ్రహ్మణ్యశాస్త్రి యనుకొనలేదు. తమ యాంధ్రధ్వని మీద బ్రతికూలాభిప్రాయము వెల్లడించి దొసగులున్నవని యెన్ని పత్రికలో బ్రచురించినపుడు, శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారికి లేఖమూలమున “మహాశయ! మీరు ప్రత్త్రికాముఖమున బ్రకటింపనేల ? మీ వంటివారు ప్రత్యేకముగ నాకు దెలిపిన సరిచేసి కొనక పోయితినా ?” యని వ్రాసి పంపిరట. మఱియొకసంగతి:-

కాట్రావులపల్లి (జగ్గంపేట) జమీందారు శ్రీ దామెర సీతారామస్వామిగారు రసికుడైన విద్వత్ప్రభువు. వారిదర్శనమునకు మన శాస్త్రిగారొక తూరి వెళ్లి, రాజగురువులను జూచి, ఆయన యేమి చదివితిరని ప్రశ్నింప “నేదో కొంచెము సాహిత్యము, కొంచెము వ్యాకరణము, కొంచెము కవితనల్లుట గురుకటాక్షమున నేర్చుకొంటి” నని చెప్పిరట. అప్పుడాయన ‘పిఠాపురపు బరీక్ష^ నొనగితిరా ? యని యడిగిరి. లేదని శాస్త్రిగారు సమాధానము చెప్పిరి. లేనిచో మాఱేని దర్శనముకాదని యాసంస్థాన గురువు చెప్పిపొమ్మనెను. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు నిస్పృహులైపోదలచి పోవుచు, నూతనాస్థానకవి శ్రీ ద్వివేదిరామశాస్త్రిగా రొకచోట గూర్చుండ నచ్చటకుజేరి, వారితో నేదో లోకవృత్తాంతము సంస్కృతభాషలో బ్రసంగించిరట. ఆ రామశాస్త్రిగారు మన కవివరుని నిరర్గళధోరణికి బాండితికి నాశ్చర్యపడి ప్రభువు దర్శనము చేయించిరనియు, నాప్రభువు ఎదుట గోడమీదనున్న “శకుంతలా” ప్రతిమను వర్ణింపుడన నాయన మనసు గరగునటులు సంస్కృతములో శ్లోకములు రచించి చూపిరనియు, నప్పుడు శ్రీవారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి వార్షిక మేర్పాటు చేసెరనియు శ్రీ రామశాస్త్రిగారు “అభినవభోజచరిత్ర” లో వ్రాసిరి. ఈగాథ శాస్త్రిగారి నిర్గర్వితకు దారకాణగదా, యని పేరుకొనవలసి వచ్చినది.

వీరు తెనాలి సంస్కృతకళాశాలలో గొన్నాళ్లును, బందరు :హిందూ హైస్కూలు” లో గొన్నాళ్లును, బాపట్ల శంకరవిద్యాలయములో గొన్నాళ్లును ఆచార్యులుగా నుద్యోగించిరి. తరువాత 1927 లో కొవ్వూరు “ఆంధ్రగీర్వాణ విద్యాలయము” వారి యాహ్వానముపై వెళ్లి యచట సంస్కృతాంధ్రోపాధ్యాలుగా నెనిమిది తొమ్మిది యేండ్లుండి 1935 లో జీవయాత్ర చాలించిరి. కొవ్వూరి కళాశాలలో నుండగా శాస్త్రిగారికి, కాకినాడ విద్యార్థులు మా ‘కళాశాల’ కు దయచేయుడని యుత్తరములు వ్రాయ, “నేను గౌతమీస్నానమునకు గొవ్వూరిలో జేరితిని గాని, ఉద్యోగము చేయుటయే ప్రధానోద్దేశము కా” దని సమాధానము పంపిరని తెలిసినది.

సుబ్రహ్మణ్యశాస్త్రిగారు నైష్ఠికులు. పండితులు. కవులు. రసహృదయులు. శాంతచిత్తులు. వారిపేరు తెలుగువారు మఱచిపోరు. వారి కృతులు మనభాషకు భూషలు. ఇట్టివాడు కనుకనే సుబ్రహ్మణ్య శాస్త్రినిగూర్చి కింకవీంద్రఘటాపంచాననుడు చెళ్ళపిళ్ళకవి “పేరి కతండు శిష్యుడని పేర్కొన కొప్పక పోదుగాని కై, వారము గాదు నాకతడు వారక దేశికువంటివాడె……” యని మెచ్చుకొనెను. సర్వధా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ధన్యులు. పుత్రసంతానములేని కొఱత వారి విషయములో గొఱతయేగాదు. “పుత్రాత్సద్గతి రితిచేత్తదపి ప్రాయోస్తియుక్త్యనహమ్” అను శాంకరసూక్తి నెఱిగిన వారి కటు లనుపించదు. సంగీతసాహిత్య తత్త్వవేత్త యగు శ్రీ హరి నాగభూషణముగారు వీరి యంతేవాసి. వారేకాదు, మఱియెందఱో శాస్త్రిగారి సేవాభాగ్యము వడసి, పండితులై కవులై పేరుపెంపులు గాంచిరి.

సుబ్రహ్మణ్య శాస్త్రిగా రవధాన సందర్భములలో గావించిన దేవీస్తవము లివి పరికించినచో , ఆయన యెన్ని సంస్థానములలో సత్కారములు గాంచెనో వ్యక్తమగును.

సీ. ఏదేవి దయ జయమిప్పించె సత్కలా
పూర్ణమౌ “నెల్లూరు” పురమునందు
ఏతల్లి బిరుదంబు లెనయించె నల “పెద్ద
పవని భూపాలుని” సవిధమందు
ఏయమ్మ కారుణ్య మేడుగడగ నుండె
“కందుకూరి” వధాన కార్యమందు
ఏమాత ధారా సమృద్దుల నెసగించె
నెట్టనె “కనిగిరి” పట్టణమున
గీ. అట్టి లోకైకజనని, హృదంబురుహ ని
రంతరాభ్యర్చ్యమాన పాదాంబుజాత
జాతరూపమణీ విభూషా విశేష
భూషితాకార సత్ సభ బ్రోచుగాక! “తెనుగు కావ్యాదర్శనము” లోని పద్యము:-
సీ. లష్కరు నగరి కల్లవ్పసత్రంబున
షష్ట్యవధానంబు సంతరించి
గద్వాల నగరున విద్వత్సభ నశీతి
లేఖినీ కవన మల్లింపజేసి
ఆత్మకూరు నగరి నాశుకవిత్వ లీ
లాస్ఫూర్తి రాజవల్లభ్యమొసగి
ముక్త్యాల నృపుచెంత మోహనంబైన యు
పన్యాసధోరణి వరల జేసి

గీ. తగగ బలుచోట్ల నష్టావధాన సభల
నాశుధారాకవిత్వ మహత్త్వ మిచ్చి
నన్ను మనుచు మాతల్లి మన:ప్రమోద
దానసంతాన వల్లీమతల్లి గొలుతు

ఆంధ్ర రచయితలునుండి-

———–

You may also like...