వేమూరి వేంకటేశ్వరరావు (Vemuri Venkateswara Rao)

Share
పేరు (ఆంగ్లం) Vemuri Venkateshwara Rao
పేరు (తెలుగు) వేమూరి వేంకటేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు తెన్నేటి సీతారామమ్మ
తండ్రి పేరు వేమూరి సోమేశ్వరరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ 01/17/1938
మరణం
పుట్టిన ఊరు చోడవరం, విశాఖపట్నం జిల్లా
విద్యార్హతలు ఎం.ఎస్,పి.హెచ్.డి.
వృత్తి రచయిత, కంప్యూటర్ సైన్సు ఆచార్యులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు జీవరహస్యం (ప్రాణం లేని జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ), రసగంధాయ రసాయనం (ఇంటింటా, వంటింటా వాడే సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం), జీవనది (మన శరీరంలో ప్రవహిస్తూ మనకి ప్రాణాన్ని ఇచ్చే రక్తం కథ), కినిగె ప్రచురణ విశ్వస్వరూపం (ఈ విశ్వం యొక్క పుట్టుపూర్వోతరాల కథ), కినిగె ప్రచురణ నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, (సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం), కినిగె ప్రచురణ ప్రాణి ఎలా పుట్టింది?, (జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ), కినిగె ప్రచురణ అలనాటి అమెరికా అనుభవాలు, (1960 దశకంలో అమెరికా ఎలా ఉండేదో చెప్పిన అనుభవాలు), కినిగె ప్రచురణ కించిత్ భోగో భవిష్యతి, (సైన్సు ప్రాతిపదికగా కల కథలు), కినిగె ప్రచురణ మహాయానం, (సైన్సు ప్రాతిపదికగా కల కల్పిత కథలు), కినిగె ప్రచురణ ధర్మసంస్థాపనార్థం, (రకరకాల కల్పిత కథలు) రామానుజన్ నుండి ఇటూ అటూ, (రామానుజన్ చేసిన పనిని అందరూ అర్థం చేసుకోడానికి చేసిన ప్రయత్నం), కినిగె ప్రచురణ ఫెర్మా చివరి సిద్ధాంతం, (పైథాగరోస్ సిద్ధాంతాన్ని సాధారణీకరించడంలో ఇబ్బందులు అందరికీ అర్థం అయే పద్ధతిలో), కినిగె ప్రచురణ తెలుగులో కొత్త మాటలు, (తెలుగులోకి క్రొంగొత్త మాటలు ప్రవేశపెట్టే విధానాలు), కినిగె ప్రచురణ, 2016 చుక్కల్లో చంద్రుడు: చంద్రశేఖర్ కథ, (ప్రఖ్యాత నక్షత్రభౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత జీవిత చరిత్ర), సుజనరంజని, ఆగస్టు 2017, సిలికాన్ ఆంధ్ర ప్రచురణ, కినిగె ప్రచురణ, 2017 గుళిక రసాయనం (క్వాంటం కెమెస్ట్రీ), కినిగె ప్రచురణ, 2018. ఒకటి, రెండు, మూడు,…, అనంతం, కినిగె ప్రచురణ, 2019. మన నాయకులకి కాసింత భౌతికశాస్త్రం, కినిగె ప్రచురణ, 2020.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు https://kinige.com/book/Viswaswaroopam,http://www.emescobooks.com/writers.php?more=66,https://kinige.com/book/Alanati+America+Anubhavalu
పొందిన బిరుదులు / అవార్డులు పబ్లిక్ సర్వీస్ అవార్డు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్ వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, 2 జూలై 2004, చికాగో (సప్న, సిరి ఫౌండేషన్), అమెరికా కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013 తానా అచీవ్‌మెంట్ అవార్డు, 2013, సేన్ హొసే, కేలిఫోర్నియా, అమెరికా జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా 11 వ రాధికా సాహితీ అవార్డు, 2019, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక బొమ్మలూరు (కథ)
సంగ్రహ నమూనా రచన ఆమె బద్ధకంగా కళ్లు నులుముకుంటూ నిద్ర లేచింది. అలవాటయిన శయ్యలా అనిపించలేదు. ఒళ్లు విరుచుకుంటూ మంచం మీద నుండి కిందకి దిగింది.విందు భోజనంతో పాటు తాగిన మాదక పానీయపు మోతాదు ఒక రవ ఎక్కువ అయిందో ఏమో బుర్రంతా దిమ్ముగా ఉంది. కాసింత కాఫీ కలుపుకు తాగితే కాని పూర్తిగా మెలుకువ వచ్చేటట్లు లేదు. చుట్టూ ఆమె కలయజూసింది. పరిచయమైన గదిలా లేదు. అలాగని హొటేలు గదిలానూ లేదు. ఎవరిదో ఇల్లు.

బొమ్మలూరు(కథ)

-వేమూరి వేంకటేశ్వరరావు

       

ఆమె బద్ధకంగా కళ్లు నులుముకుంటూ నిద్ర లేచింది. అలవాటయిన శయ్యలా అనిపించలేదు. ఒళ్లు విరుచుకుంటూ మంచం మీద నుండి కిందకి దిగింది.

 

విందు భోజనంతో పాటు తాగిన మాదక పానీయపు మోతాదు ఒక రవ ఎక్కువ అయిందో ఏమో బుర్రంతా దిమ్ముగా ఉంది. కాసింత కాఫీ కలుపుకు తాగితే కాని పూర్తిగా మెలుకువ వచ్చేటట్లు లేదు.

 

చుట్టూ ఆమె కలయజూసింది. పరిచయమైన గదిలా లేదు. అలాగని హొటేలు గదిలానూ లేదు. ఎవరిదో ఇల్లు.

 

లేచిన మంచం వైపు చూసింది. అతను ఇంకా పండుకునే ఉన్నాడు. సాధారణంగా వారాంతంలో – బయటకి వెళ్లి వచ్చిన తరువాత – వారిరువురు ఎవరి గదులలో వారే పడుక్కుంటారు. రాత్రి ఏమి జరిగిందో ఏమో అతను కూడ తన మంచం మీదనే ఉన్నాడు.

 

రాత్రి కారు తోలడం అతని వాటా కనుక అతను మందు పుచ్చుకోనే లేదు. విందు వాటిక నుండి వారింటికి కారులో మహా అయితే పదిహేను నిమిషాలు దూరం. తనకి తన పరుపు మీద తప్ప మరెక్కడా పడుక్కోవడం ఇష్టం ఉండదని అతనికి తెలుసే! ఇలా మధ్యంతరంగా ఇక్కడ ఆగవలసిన అవసరం లేదే! ఇది ఎవరిల్లబ్బా! మైకం కమ్మిన తనని తీసుకొచ్చి ఎవరో స్నేహితుల ఇంట్లో రాత్రి పడుక్కుందుకి ఆగి ఉంటాడా!

 

బుర్ర పని చెయ్యడం లేదు. కప్పు కాఫీ తాగాలి ముందు.

 

అతన్ని కుదిపి నిద్ర లేపింది.

 

ఎక్కడ ఉన్నాం?” నెమ్మదిగా అతని చెవిలో గుసగుసలాడింది, ఆమె.

 

ఎక్కడున్నామా? చెబుతాను కానీ ముందు లేచి కప్పు కాఫీ తాగనీఅంటూ అతను లేచి మంచం మీద కూర్చున్నాడు. చుట్టూ కలయజూసేడు. ఎక్కడున్నాడో అతనికీ అర్థం కాలేదు.

 

మంచి ప్రశ్నే! రూం సర్విస్ ని పిలచి కాఫీ తెప్పిస్తానుండుఅంటూ మగతగా మంచం పక్కనున్న బల్ల మీద టెలిఫోను కోసం చూసేడు. అక్కడ ఏమీ కనపడలేదు.  లేచి కాళ్లీడ్చుకుంటూ పక్క గదిలోకి వెళ్లేడు.

 

ఇది హొటేలులా లేదు. ఇక్కడొక వంట గది ఉంది. కాసింత కాఫీ పెడతానుండు,” అంటూ కాఫీ కాచుకునే సరంజామా కోసం వెతికేడు. అక్కడ ఉన్న అలమారులు, సొరుగులు, బీరువాలు అన్నీ ఖాళీ. రెఫ్రిజిరేటర్ తెరచి చూసేడు. అక్కడ ఉండవలసిన పాలు కాని, పళ్లు కానీ, గుడ్లు కానీ, ఏవీ కనబడ లేదు. ఎండిపోయిన రెండు రొట్టె ముక్కలు కనిపించేయి తప్ప అది కూడా ఖాళీయే!

 

నిస్పృహతో చుట్టూ చూసేడు.  గోడకి తగిలించిన టెలిఫోను కనిపించింది. దానిని చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకునిహల్లోఅని పిలచేడు.

 

ఎవ్వరూ పలకలేదు. అసలు ఆ టెలిఫోనులో ఏ విధమైన శబ్దమూ వినబడలేదు. పైపెచ్చు  దాని నుండి ఏ తీగా బయటకి వస్తూన్న దాఖలాలు కనబడ లేదు. లోపల కనెక్ షన్  ఎక్కడో వదులుగా ఉందేమోనని ఆ టెలిఫోనుని ఇటూ అటూ కుదిపేడు. ఆ కుదుపుకి ఆ టెలిఫోను కాస్తా గోడ నుండి ఊడి అతని చేతిలోకి వచ్చేసింది. దాని వెనుక ఏ రకమైన తీగలూ లేవు. అక్కడ ఏ బెజ్జమూ లేని చదునైన గోడకి ఒక అయస్కాంతపు ముక్కతో అతికించబడి ఉంది.

 

ఇదేమి మాయదారి ఇల్లురా బాబూ అనుకుంటూ అతను, ఆమె మేడ దిగి ఆ ఇంట్లోంచి బయటకి వచ్చేరు ఎక్కడైనా గుక్కెడు కాఫీ చుక్కలు దొరుకుతాయన్న ఆశతో.

 

బయట వీధిలో వాళ్ల కారు కనపడ లేదు.  అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక వ్యక్తి కాని, ఒక వాహనం కాని కనబడ లేదు. ఇల్లు ఎంత వింతగా ఉందో ఊరూ అలానే ఉన్నట్లు అనిపించింది.

 

మన కారు ఏమైనట్లు?” ఆమె అడిగింది.

 

అతను బుర్ర గోక్కున్నాడు. ముందు రోజు సాయంత్రం తను కారు తోలుతూన్నప్పుడు ఏదో నీడ తన ముఖం మీద పడ్డట్లు అతనికి జ్ఞాపకం వచ్చింది. ఆ తరువాత ఏమి జరిగిందో ఎంత ఆలోచించినా అతనికి స్పురణకి రాలేదు. అలా దూరంలోకి చూస్తున్నాడు, ఏదైనా జ్ఞాపకం వస్తుందేమోనని.

 

దూరంలో ఒక గాలిగోపురమూ, గంటస్తంభమూ కనబడ్డాయి. అదేదో దేవాలయంలా ఉందని ఇద్దరూ అక్కడకి నడుచుకుని వెళ్లేరు. లోపల ప్రవేశించేరు. అంతా ఖాళీ. దేవుడి ఎదుట గంటని పదే పదే కొట్టేడు అతను పూజారి దర్శనమిస్తాడనే ఆశతో. ఎవ్వరూ కనబడ లేదు.

 

ఈ ఊళ్లో వాళ్లందరూ హడావిడిగా ఊరు ఖాళీ చేసేసి వెళ్లిపోయేరో ఏమో. ఏమి ఉపద్రవం వచ్చిందో?” అన్నాది ఆమె.

 

ఇద్దరూ బయటకి వచ్చేరు.ఇక్కడ ఎవ్వరైనా ఉన్నారా?” అంటూ అతను ఎలుగెత్తి అరచేడు. అతని ఆర్తనాదం ఎవరికైనా వినబడిందో లేదో తెలియదు కానీ, ఎక్కడ నుండో ఒక కిలకిలారావం వినిపించింది. ఎక్కడో దగ్గర నుండే వస్తూన్నట్లు ఉందా ధ్వని. అది ఆర్తనాదం కాదు. ఒక చిన్న పిల్ల గొంతుకలా ఉంది. అందరూ హడావిడిగా ఊరు వదిలేసి పారిపోతూ ఒక చిన్న పిల్లని కాని దిగవిడచి పోయారా?

 

చుట్టూ చూసేరు, ఇద్దరూ. ఆ శబ్దం మళ్లా వినబడలేదు. ఇద్దరూ విన్నారు కనుక వినబడ్డ కిలకిల భ్రమ కాదు. మరేమై ఉంటుందో?

 

ఎలాగైనా ఈ ఊళ్లోంచి బయట పడాలి. వాళ్లిద్దరూ దిక్కు తోచక ఆ వీధులలో ఇటూ అటూ తిరుగుతున్నారు. ఇంతలో దూరంగా వీధి పక్కన ఆగిన ఒక కారు కనిపించింది.

 

అతను పరుగు పరుగున ఆ కారుని సమీపించేడు. మిలమిలా మెరుస్తూ కొత్తగా కనిపించింది. తలుపు తెరచేడు. కారు ఖాళీగా ఉంది. లోపల కూర్చున్నాడు. ఎదురుగా తాళాలు వేల్లాడుతూ కనిపించేయి. ఎంతో ఆశతో, ఎంతో ఆతృతతో తాళాలని తిప్పుతూ కారుని నడపడానికి ప్రయత్నించేడు. కారు ఏ రకమైన చప్పుడూ చెయ్యలేదు.మూడొంతులు బేటరీ లో పసరు ఎండిపోయిందేమోఅనుకుంటూ కారు దిగి, బయటకి వచ్చి, ఇంజనుని కప్పి ఉండే మూతని పైకి లేవనెత్తేడు. ఆశ్చర్యం! అక్కడ ఇంజను లేదు. వెనక్కి వెళ్లి డిక్కీ తలుపు తెరచి చూసేడు. అక్కడా ఇంజను లేదు.

 

బిక్క ముఖంతో అతను నిశ్చేష్టుడై నిలబడ్డాడు.

 

మళ్లా అదే కిలకిలారావం వినబడింది. సందేహం లేదు. ఒక అమ్మాయి గొంతుకలా ఉందా ధ్వని. ఎవరో తనని ఒక ఆట పట్టిస్తున్నారా? ముందూ, వెనకా, చుట్టూ చూసేడు. ఎవ్వరూ కనబడ లేదు. పరిస్థితి అర్థం కాలేదు.

 

ఇంతలో దూరం నుండి రైలు కూత వంటి శబ్దం వినబడింది. అతను, ఆమె, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, ఆ కూత వచ్చిన దిశ వైపు పరుగెత్తుకుని వెళ్లేరు. అక్కడ బయలుదేరడానికి సిద్ధంగా ఒక రైలుబండి కనబడింది.

 

ఈ ఊరు నుండి బయట పడాలంటే ఇదే శరణ్యం. పద. బండి ఎక్కుదాంఅంటూ ఇద్దరూ ఆ రైలుబండి ఎక్కేసేరు.

 

లోపల అంతా అధునాతనంగా ఉంది. సరికొత్త బండిలా ఉంది. బారులు తీరిన దిండు కుర్చీలు ఇటు రెండు, అటు రెండు, మధ్యలో నడవ. కాని బండి అంతా ఖాళీ. ప్రయాణీకులు ఎవ్వరూ లేరు.ఊరు వదలి అంతా వెళ్లిపోయి ఉంటారుఅనుకుంటూ సమాధానపడి కూర్చున్నారు. ఇంతలో బండి కదలింది. కిటికీలోంచి బయటకి చూస్తూన్న వారికిబొమ్మలూరుఅని ఆ ఊరి పేరు ఒక బల్లచెక్క మీద కనిపించింది.

 

హమ్మయ్య! ఎక్కడున్నామో తెలిసింది!అనుకుంటూ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ పీడకల ఇంతటితో అంతం అయిపోతుందన్న ఆశ వారిలో మొలకెత్తింది. బండి జోరందుకుంది. ఒక వంతెన దాటుకుని, ఒక గుహలోంచి బయటకి వచ్చి, నెమ్మదిగా పక్క స్టేషన్ లో  ఆగింది.

 

అరె! ఈ ఊరి పేరు కూడ బొమ్మలూరే! అరెరె! కాదు. మనం బయలుదేరిన చోటికే తిరిగి వచ్చేసేం!!

 

ఈ సారి అతనికి భయం వేసింది. ఇదేమీ పీడకల కాదు కదా!

 

ఇద్దరూ గభీమని బండి దిగి, బయట పడ్డారు. భయంతో పరుగెడుతున్నారు. ఆమె వెనకపడిపోతోంది. పరిగెత్తలేక పడిపోయింది.

 

మళ్లా అదే కిలకిలారావం. అదే గొంతుక. ఆ అమ్మాయే! పడిపోయిన వ్యక్తిని చూసి నవ్వుతోందా?

 

అతను వెనక్కి తిరిగి ఆమెని లేవనెత్తడానికి సమీపించేడు.

 

ఏదో పొడుగాటి వస్తువు కదులుతూన్నట్లు వారిద్దరి మీదా పైనుండి ఒక కదిలే నీడ పడింది. ముందురోజు సాయంత్రం కారు తోలుతూన్న సమయంలో అతని మీద అదే రకం నీడ పడింది. ఒక్క క్షణం పాటు ఏమి జరిగిందో తెలియలేదు కాని మరుక్షణంలో ఆ కదిలే నీడ ఆమెని సమీపించింది. కిందకి ఒరిగిపోయిన ఆమెని లేవనెత్తింది. ఆ తరువాత అదే నీడ ఆమెని ఆదుకుందామని పరిగెత్తుకు వస్తూన్న అతనిని కూడ పొదివి పట్టుకుంది.

 

ఆ నీడ వారిద్దరిని పైకెత్తింది. వారు పైకి లేస్తూ ఉంటే గుడి గోపురం క్రమంగా కిందకి దిగిపోతోంది. ఎత్తుకి అలవాటు పడని కళ్లు తిరిగి చీకట్లు కమ్ముకున్నాయి. కదలిక ఆగిన తరువాత అతను కళ్లు విప్పేడు. ఉదయం ఏ మంచం మీద నుండి లేచేరో ఆ మంచం మీదనే ఇద్దరినీ పడుక్కోబెట్టింది ఆ కదిలే నీడ.

 

అతను, ఆమె కళ్లప్పగించి చూస్తున్నారు. చెవులు రిక్కించి వింటున్నారు. వాళ్లు ఒంటరిగా లేరు. ఎవరింట్లోనో ఉన్నారు. ఆ ఇల్లు కూడ వారనుకున్నట్లు ఖాళీగా లేదు.

 

చిన్న బాలిక చేసే కిలకిలారావం పైనుండి వస్తోంది. పైపెచ్చు ఆ పిల్ల కేరింతాలు కొడుతూన్న శబ్దం కూడ వినబడుతోంది.  ఆ అమ్మాయి ఆడుకుంటోంది కాబోలు. నేపథ్యం నుండి మరొక పెద్దామె గొంతుక స్పష్టంగా వినిపిస్తోంది:అమ్మాయీ! చూడమ్మా! మీ నాన్న నీకోసం భూలోకం నుండి తీసుకొచ్చిన బొమ్మరిల్లు బావుందా?”

 

ఆ మాట వినగానే ఉదయం లేచినప్పుడు గుసగుసలాడుతూ ఆమె అతనిని అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది. 

 

కథ వెనుక కథ: 

 

ఆంధ్రజ్యోతి, 17 మే 2015 (ఆదివారం) సంచికలో ప్రచురణ పొందింది. ఆంధ్రజ్యోతి సంపాదకురాలు వసంతలక్ష్మి కథ పాఠకులకి అర్థం కాదంటూ నా చేత బలవంతంగా చివర మరొక్క వాక్యం రాయించేరు. పాఠకుల ఆలోచనాశక్తిని కించపరచడం ఇష్టం లేక ఆ చివరి వాక్యం ఒక్కటీ ఇక్కడ తీసేసేను. 

సంపాదకురాలు చేర్పించిన వాక్యం:తామున్నది మహాకాయులు నివసించే మరోలోకంలో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మరిల్లులో అని వారికి అర్థం అయింది.

ఒక పాఠకుడు స్పందిస్తూ ఆ చివరి వాక్యం రాసి పాఠకుల ఆలోచనా శక్తిని కించపరచేనని వ్యాఖ్యానించేడు. 

 

ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్మీడియేట్ లో పాఠ్యపుస్తకంగలివర్స్ ట్రావెల్స్లోవాయేజ్^ టు బ్రాబ్డింగ్నేగ్చదువుతూన్నప్పుడు మా గురువుగారు ఇలాంటి కథే ఒకటి చెప్పగా అది గుర్తుకు వచ్చి రాసిన కథ. నేను బింఘంటన్  లో ఉద్యోగం చేస్తున్నప్పుడు దగ్గరలోనే ఉన్న ఇథకా కాలేజీలో పని చేస్తున్న రాడ్ సెర్లింగ్ ఉపన్యాసం విన్నాను. అయన ఇటువంటి కథనే  టివిలో 1960 దశకం నాటి ట్వైలైట్ జోన్ పరంపరలో తీసినట్లు చెప్పేడు.  


*****

You may also like...