పేరు (ఆంగ్లం) | Kanuparti Varalakshmamma |
పేరు (తెలుగు) | కనుపర్తి వరలక్ష్మమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | హనుమాయమ్మ |
తండ్రి పేరు | పాలపర్తి శేషయ్య |
జీవిత భాగస్వామి పేరు | కనుపర్తి హనుమంతరావు |
పుట్టినతేదీ | 10/7/1896 |
మరణం | 8/13/1978 |
పుట్టిన ఊరు | బాపట్ల |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://vihanga.com/?p=9579#sthash.W1AHLOIX.dpbs |
స్వీయ రచనలు | శారదలేఖలు, మా ఊరు, పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, కథ ఎట్లా ఉండాలి, ఉన్నవ దంపతులు,సౌదామిని,లేడీస్ క్లబ్ , రాణి మల్లమ్మ , మహిళా మహోదయం , పునః ప్రతిష్ట వంటి నాటికలు , ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం , ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు , ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు ,గాంధీ మీద దండకం కూడా రచించారు . |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి, గుడివాడ పౌరులనుండి కవితా ప్రవీణ, |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కనుపర్తి వరలక్ష్మమ్మ |
సంగ్రహ నమూనా రచన | సౌభాగ్య వతియగు కల్పలతకు , నెచ్చలీ ! నేడు మన గృహలక్ష్మీ బాలకు పదునొకండవ జన్మ దినోత్సవమని తెలిసికొనుటకు నీవలెనే నేనును ముదంబుజెందుచున్నాను . ఈ శుభ సమయమున గృహలక్ష్మి మన ఆంద్ర నారీ లోకమునకు తన జన్మ దినోత్సవ కానుకగా సమర్పించిన లలిత కళా సంచికను జూడ ఆయనంద మితోధికమగు చున్నది . నిజముగా నిట్టి యుపాయనము ‘గృహలక్ష్మి ‘ సమర్పించుట గనుక , ‘పుట్టి నేర్చి కొనెనో పుట్టక నేర్చికొనెనో చిట్టి బుద్ధులిట్టి ‘వను భాగవత సూక్తి స్ఫురణకు వచ్చుచున్నది . ఏల నందువా ? గృహిణి జీవితమంతయు కళాత్మకమే గదా ! సౌందర్య విలసితమగు కళా శాఖ కంతయు నామె యే గదా అధిపత్ని . లలిత కళలతో గృహలక్ష్మి కి గల యీ ప్రగాఢ సంబంధమును గుర్తెరిగి ‘గృహలక్ష్మి ‘లలిత కళా సంచికను కానుకగా దెచ్చుట యెంత సముచితముగా నున్నదో చూడుము ! |
కనుపర్తి వరలక్ష్మమ్మ
శారద లేఖలు
సౌభాగ్య వతియగు కల్పలతకు ,
నెచ్చలీ ! నేడు మన గృహలక్ష్మీ బాలకు పదునొకండవ జన్మ దినోత్సవమని తెలిసికొనుటకు నీవలెనే నేనును ముదంబుజెందుచున్నాను . ఈ శుభ సమయమున గృహలక్ష్మి మన ఆంద్ర నారీ లోకమునకు తన జన్మ దినోత్సవ కానుకగా సమర్పించిన లలిత కళా సంచికను జూడ ఆయనంద మితోధికమగు చున్నది . నిజముగా నిట్టి యుపాయనము ‘గృహలక్ష్మి ‘ సమర్పించుట గనుక , ‘పుట్టి నేర్చి కొనెనో పుట్టక నేర్చికొనెనో చిట్టి బుద్ధులిట్టి ‘వను భాగవత సూక్తి స్ఫురణకు వచ్చుచున్నది . ఏల నందువా ? గృహిణి జీవితమంతయు కళాత్మకమే గదా ! సౌందర్య విలసితమగు కళా శాఖ కంతయు నామె యే గదా అధిపత్ని . లలిత కళలతో గృహలక్ష్మి కి గల యీ ప్రగాఢ సంబంధమును గుర్తెరిగి ‘గృహలక్ష్మి ‘లలిత కళా సంచికను కానుకగా దెచ్చుట యెంత సముచితముగా నున్నదో చూడుము !
ఆమె నివసించునది మహిన్నత సౌధమే కానిమ్ము క్షుద్రాతి క్షుద్ర పర్ణ కుటీరమే కానిమ్ము దాని ప్రసక్తి యామె కక్కరలేదు . ఆవాస ప్రదేశమంతయు లలిత కళా సుందరముగా నొనర్చుటయే యామె లక్ష్యము . ఉదయము సూర్య భగవానుడు అపరంజికాంతుల జిమ్ముచు పొడుపు గొండపై బొడసూపుటయే తడవు పిడికిట మ్రుగ్గు పట్టి యామె కళారాధనకు దొరకొనును . కసవూడ్చి కలయంపి జల్లిన యా ప్రాంగణ మెంతలో చిత్ర శాలయై పోవును ! ఆహా ! ఏమియా రంగ వల్లులు సౌరు ! తీర్చు దిదినట్లు అచ్చున గ్రుద్దినట్లు ఎంత ముచ్చటగా నుండును ! తదుపరి పెరటిలో ప్రవేశించును . వృంతచ్యుత ములైన పత్ర పుష్పాదులతో పెరడంతయు నెంతయో చికాకుగా నుండును . సౌదర్యారాధకురాలైన గృహిణి ఆ అనాకారత నెట్లు సాహించగలదు ? నిముసములో నదియు చక్కబరచి నచ్చట కూడా మరల మ్రుగ్గులు తీర్చును . ఆపైన గృహములో ప్రవేశము . అందలి ఏ ప్రదేశముగాని ఏ వస్తువుగాని అపరిశుభ్రముగ అనాకారముగ లేకుండ చక్క బరచుట గృహిణి మొదటి పని . పిమ్మట తాను తన బిడ్డలు చక్కగ తలలు దువ్వుకొని స్నానమొనర్చి మంచి దుస్తులు ధరించుట , తదుపరి వంటకముల సంగతి . ఆహా! అది యెంత గొప్ప శాస్త్రము ! ఆ శాస్త్రములో గృహిణికెంత విలువయిన యనుభవము , ఎంతకుశలత ! ఎంత కీర్తి ! బంధువులు , మిత్రులు , అతిధులు , భ్యాగతులు , అందరిని గృహిణి తృప్తినందింప గలది , రంజింపజేయు గలుగునది . పాక కళ పాండితి వలననే గదా ! భక్ష్య భోహ్య లేహ్య చోష్య పానీయాదులనబడు పంచవిధ పాకములను గృహిణి నేర్చినది గదా దేవ పితృస్వామ మనుష్యాది పంచ మహా యజ్ఞములను గృహస్తు నెరవేర్చుకొన గలుగును . పాక కళ కేవలము గృహిణి విద్య . ఆమె సుకోమల హస్తముల నుండి సిద్ధమైన షడ్రసోపేతమగు నానావిధమగు శాకపాకముల చేతను వ్యంజనముల చేతను జీవ ప్రపంచ మంతయు సంతృప్తమగు చున్నది . ఆహా ! ఎత్తి మహాత్తర భాగ్యము భగవానుడు గృహిణికి ప్రసాదించాడు .
భోజనానంతరము గృహిణికి విశ్రాంతి జిక్కును .దేహ సౌఖ్యమా శించినచో నామె కొంచెము సేపు గుఱ్ఱు పెట్టి నిద్రిం పవచ్చును , కాని కళావతి యగు స్త్రీ తన గృహము యొక్కయు తన యొక్కయు నందచందములు చూచుకొనకుండ నిద్రించునా ? తీరుబడి సమయము నామె ఇట్లు వ్యర్ధమొనర్చిన నామె గృహభిత్తికలకు పటము లెవరు కుట్టి పెట్టుదురు ? ద్వారములకు సుందరములగు యవనిక లెట నుండి వచ్చును ? తన బిడ్డలకు రంగు రంగు ఊలు టోపీలు మేజోళ్లు తనకు సరిగా పట్టుపని చేసిన రవికలు , చీరెలు , ఎట్లు సిద్ధమగు . కాణ విశ్రాంతి కాలమున ఆ పనులలో నిమగ్నయగును . ఈ లోనేన్ని మారులో బిడ్డలు కనులు నులుముకొనుచు వచ్చి తల్లిపై బడి వేధించెదరు ? వారినెంత లాలించవలయును ? స్నిగ్ధ మనోహరమగు మృదు మధుర కంఠస్వరముతో నేనని పాటలు పాడి వారిని నిద్ర పుచ్చువలెను . గృహిణి గాయకురాలు కాదేని ఆమె గృహ దేవతల స్తోత్ర మోనర్చు టెట్లు ? గృహ దీపికలైన యామె చిన్నారి బిడ్డల నిద్ర బుచ్చుటెట్లు ? ఆమె గృహమున జరిగెడి పెరంటములకు శోభ చేకూరు టెట్లు ? కాణ ఆమె కవయిత్రియు , గాయని యునై యుండవలయును గదా . వేయేల కల్పలతా ! గృహమొక రాజ్యము . ఆయా స్థానమున శిల్పి స్త్రీ , చిత్రకారిణి స్త్రీ , పాచాకురాలు , మాలా కారిణి స్త్రీ . అదియు నిదియునని చెప్పనేల ? ఆ గృహము , గ్రుహావరణము , గృహిణి , గృహస్తు , గృహాలంకారములైన బిడ్డలు , సర్వులు సౌందర్య విలసితమై దర్శనీయమై తనరారుటకు సుమధురమగు కంఠస్వరమును , సున్నితమగు చిత్తమును ఏ విధాత స్త్రీకి ప్రసాదించినాడో ఆ పరమేష్టి చేతనే యను గ్రహింపబడిన vara ప్రసాదము . నారీ సహజములగు నీ లలిత కళలో పురుషులు ప్రవీణత గణింపజాలరు .
సహజ సిద్ధమైన ఈ లలిత కళలయందు ఏ స్త్రీ కోరనోములు నోచినదో నిజముగా నామె జీవితము వ్యర్ధమే . ఈ గృహము యెడారియే . అందులో సౌందర్యము లేదు . సంతోషములేదు . సౌఖ్యము లేదు .
మన హైందవ గృహిణి లోకమున కీకళాభిరుచియు , సౌదర్య పిపాసయు నవ్యమనియు , ప్రాశ్చాత్య నాగరికతా సంపర్కముచే నేర్పడినదనియు కొందరు భ్రాంతులగుచున్నారు . కాని ఇది సరిగాదు , మన ప్రాచీన గ్రంధములందు స్త్రీల చతు షష్టి కళలు ప్రత్యేకముగా వ్రాయబడి యున్నవి . వానియందు సుకుమారములగు కవిత్వము , గానము , చిత్ర లేఖనము , దారి శిల్పము , రంగవల్లులు , పుష్పాలంకారము , సుగంధ ద్రవ్యములు తయారు చేయుట , పిండి వంటలు జేయుట , గృహాలంకారము , కుట్టుపని మ తోట పని , రంగులద్దకము , రత్న పరీక్ష , లోహపరీక్ష , నృత్యము , ఆటలు మొదలగున వెన్నియో గలవు .
ఎల్లపుడొకే విధమగు నలంకారము ధరించుటయు , నొకే విధమగు వస్త్రముల దాల్చుటయు , నొకే వ్ధమగు కేశ బంధములు నమర్చుకొనుటయు కళావతియగు స్త్రీకి సమ్మతము గాదు . నగల ధరించుటలో వస్త్రముల దాల్చుటలో , కేశములు సంస్కరించుటలో , పూలు ముడుచుటలో ,తిలకము దీర్చుటలో నిరంతరము నవ్య పథముల నన్వేషించుచు కొంగ్రొత్త రీతుల కల్పన మొనర్చి యానందించుటే గృహిణీ లక్షణము . కావున లలిత కళలలను గురించి ప్రశస్తములగు ననేక విషయములను సేకరించి సంచికగా గూర్చి మనలకు బహుకరింపనెంచుట ‘గృహలక్ష్మి ‘కెంతయు సముచితముగా నున్నదని తలంచుచున్నాను . ‘గృహలక్ష్మి ‘కి చిరాయురున్నతుల బ్రసాదింప భగవంతునీ శుభ సమయమున బ్రార్ధింతముగాక .
భావపురి, ఇట్లు ,మిత్రురాలు 1 -3 -39 శారద
*** *** ***
సౌభాగ్యవతియగు కల్పలతకు ,
నెచ్చలీ ! శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ గారు మన అభివృద్ధికై ఎన్నియో విధముల కృషి చేయుచున్నారు . నీకు తెలియునా ? యని నీవు వ్రాసిన వాక్యము సూర్యుడు ప్రతి నిత్యము ఉదయించు చుండును అతని కిరణములు తీక్షణములై వేడిని , వెలుగును నిచ్చుచుండును , నీకు తెలియునా ? అని అడిగినట్లున్నది .
శ్రీమతి దుర్గాబాయిని నేనెరుగకేమి
? చాల కాలముగ నెరుగుదును . విద్యా వతులైన స్త్రీలకును , స్త్రీ విద్య సంస్థలకును , స్త్రీ సమాజములకును , ప్రసిద్ధి గాంచిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పురవరంబున 1909 వ సంవత్సరమున శ్రీమతి దుర్గాబాయి బెల్లూరి కృష్ణవేణమ్మ , రామకృష్ణారావు గార్లను పుణ్య దంపతులకు జన్మించినది . చిన్న తనము నుండియు మంచి తెలివితేటలు చాకచక్యము గలిగి తల్లిదండ్రులేమి , పాఠశాల ఉపాధ్యాయులేమి ఏది చెప్పినాను యిట్టే గ్రహించుచు , చేయుచు చురుకు గల బాలయనిపించు కొనుటలో నీమే బాల్యము గడిచినది .
దుర్గాబాయి పది పది రెండేండ్ల బాలికగా నున్న సమయములో శ్రీ మహాత్మ గాంధీ గారి నిరాకరణోద్యమముతో మన దేశ మట్టుడుడికి పోవుట సంభవించినది . స్త్రీ పురుష వివక్షత లేక బాల వృద్ధ తారతమ్యము లేక నెల్లర నాకర్షించిన యామహోద్యమము దుర్గాబాయిని కూడా నాకర్షించింది . హిందీ నేర్చుకొనుట , నూలు వడకుట , ఖద్దరు ధరించుట ప్రారంభించినది . అదే సమయంలో 1923 సంవత్సరములో కాకినాడ నగరమున జరిగిన అఖిల భారత జాతీయ మహాసభ ఆమెను మరింత ఉత్తేజ పరచినది . ఆ సభలో ప్రముఖ సేవాదళ కార్య కర్ర్తియై ఎల్లరు మెచ్చునట్లు ఔత్తరాహులైన ప్రతినిధులతో హిందీ అనర్గళముగా మాట్లాడుచు , వారు కోరిన పనులెల్ల నోనర్చుచు నెల్లరి మెప్పు గొనినది . ఆబాల జాతీయ భాములంతటితో నాగలేదు. ప్రముఖ కాంగ్రెసు నాయకుడైన శ్రీ బులుసు సాంబమూర్తిగారి శిక్షణలో నారితేరి మద్రాసు నగరమున జరిగిన సత్యాగ్రహమున పాల్గొని అరెస్టు చేయబడి ప్రభుత్వ శిక్షకు గురియైనది . అప్పటికి దుర్గాబాయికి తెలుగు , హిందీ తప్ప యింగ్లీషు రాదు . కారాగృహవాసానంతరము ఆమె చిత్తము ఆంగ్ల విద్య పై ఆకర్షితమైనది . ఎంత కష్టమైన పని నైనను చేయవలయునను తలంపు కలిగినపుడు ఆచరణ యందు ఆలసించుట ఆమె ప్రవృత్తిలో లేదు . వెంటనే ఆంగ్ల విద్య నేర్వ నారంభించింది . క్రమముగా మెట్రిక్ పరీక్షలో కృతార్ధురాలై ఎఫ్ .ఏ .పరీక్ష నిచ్చి , ఆనర్సు చదివి అందున దిగ్విజయము గాంచి , న్యాయశాస్త్రము చదివి పట్ట భద్రురాలై ప్లీడరు వృత్తి చేపట్టినది . ఇట్లు ఉన్నత విద్య నభ్యసించుచున్నను అటు సేవారంగమును ఆమె విడనాడలేదు . బాలికలకు బృందావనమును ఒక చిన్న సంఘమును స్థాపించి దానినే ఆంద్ర మహిళా సభగా రూపిందించింది . ఆంద్ర మహిళాసభ అనతి కాలంలోనే యొక బృహత్ సంస్థయై స్త్రీల పాలిటి కల్ప తరువుగా విరాజిల్లినది . అందు స్త్రీలకు ఉన్నత విద్యయే గాదు సంగీతము , కుట్లు , అల్లిక పనులు ఒకటేమి గృహ పరిశ్రమలకు లలిత కళలకు గూడ అది ఆకరమైనది . ఎందరో యువతులు , బాలికలు అందు చేరి , విద్యాభ్యాసమునకు గడంగినారు. దేశము నందలి రాజులు , జమిందారులు , వ్యాపారస్తులు మొదలైన ధనవంతులు దానినభిమానించి భూరి విరాళము లిచ్చినారు . ఆంద్ర మహిళా సభ అనేక శాఖోపశాఖలుగా విస్తరిల్లి అనేక భవనములతో విరాజితమైనది . ఒక మిత్రురాలు అనినట్లుగా దుర్గాబాయి గారికిచ్చిన ప్రతి రూకము సార్ధకమైన పనిని చూపగలదు . కనుక అమెకందరు అరమరలేకుండా విరాళా మిచ్చెదరు . ఆమెకు విరాళముల నెంతగా రాబట్టు నేర్పుగలదో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టగల సామర్ధ్యము గలదు !
…………………………………………………..
రచన: కనుపర్తి వరలక్ష్మమ్మ
సేకరణ : శారదా లేఖలు నుంచి ….
———–